తమిళసినిమా: దర్శకుడు కథానాయకి నటనకు మెచ్చి నగదు బహుమతిని అందించడం అన్నది అరుదైన విషయమే అవుతుంది. అలా పలుమార్లు ఆణ్‌దేవదై చిత్ర దర్శకుడి నుంచి నగదు బహుమతిని అందుకున్నానంటోంది నటి రమ్యా పాండియన్. జోకర్ చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం ఆణ్ దేవదై. దర్శకుడు సముద్రకని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి తామిర దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నాయకి రమ్య పాండియన్ తన అనుభవాలను పంచుకుంది. అవేంటో చూద్దాం. జోకర్ చిత్రం చూసి నా నటనను ప్రశంసించిన దర్శక నటుడు సముద్రకని ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ తరువాత చిత్ర దర్శకుడు తామిర కథ, నా పాత్రను వివరించారు. కథ నచ్చడంతో వెంటనే నటించడానికి అంగీకరించాను. నిజం చెప్పాలంటే జోకర్ చిత్రం తరువాత ఇలాంటి కథా చిత్రంలోనే నటించే అవకాశం వస్తే నా కెరీర్ బాగుంటుందని భావించాను. జోకర్ చిత్రంలో మీరు చూసిన మల్లిక వేరు ఈ చిత్రంలో జెస్సికా వేరుగా ఉంటుంది. నటనలోనూ, రూపురేఖలలోనూ అంత వ్యత్యాసం ఉంటుంది. సముద్రకని సెట్‌లో ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు. ఆయనతో నేను ఎలాంటి భయం లేకుండా నటించాను. కారణం అంతగా ఆయన నన్ను ఉత్సాహ పరిచి ప్రోత్సహించారు. నేను తమిళ నటిని కావడం కూడా ఒక కారణం కావచ్చు.
ఇక దర్శకుడు తామిర మన ఊరు అమ్మాయి అని చాలా అభిమానంగా చూసుకుని నా నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఈ చిత్రం అంగీకరించే ముందు నాకు కలిగిన కొన్ని సందేహాలకు ఆయన చాలా వివరంగా బదులిచ్చారు. నా నటనను ప్రశంసించిన ఆయన షూటింగ్ స్పాట్‌లోనే నగదు బహుమతి అందించారు. అ సంఘటనను నేనెప్పటికీ మరచిపోలేను. చిత్ర డబ్బింగ్ సమయంలోనూ అలా రెండుసార్లు ఆయన నుంచి నగదు బహుమతిని అందుకున్నాను. సహ నటీనటులు ప్రశంసించినా, కథను, నా పాత్రను తయారు చేసిన దర్శకుడు అభినందించడంలో ఆనందమే వేరు. ఇకపై కూడా కుటుంబపెద్ద లాంటి పాత్రలే పోషిస్తారా? అని అడుగుతున్నారు. ఈ చిత్రంలో సముద్రకనికి అర్ధాంగిగా కుటుంబ పెద్ద పాత్రను పోషించినా, ఐటీలో పనిచేసే యువతిగానే నా పాత్ర ఉంటుంది. ఇçప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఒక పాత్రలో ఒక నటి నటన నచ్చితే ఆపై ఆ తరహా పాత్రల్లోనే చూడాలని కోరుకోవడం లేదు.
అందువల్ల రమ్య పాండియన్ ఒక తరహా పాత్రలకే అని ముద్ర వేస్తారన్న భయం లేదు. జోకర్ చిత్రంలో పాత్ర చాలా మందిని అలరించింది. అదేవిధంగా ఆణ్‌దేవదై చిత్రంలోని పాత్ర రమ్య పాండియన్‌లోని పూర్తి నటిని ఆవిష్కరిస్తుంది. అదే విధంగా జోకర్ చిత్రంలో నన్ను పెద్దగా ఎవరూ గుర్తించలేదు. దర్శకుడు పా.రంజిత్‌నే ఏడాది తరువాత జోకర్ చిత్రంలో నటించింది నేనేనని గుర్తించారు. అదీ సంగీత దర్శకుడు శ్యాన్ రోల్డన్ చెప్పడంతో నన్ను పిలిచి అభినందించారు. ఆణ్ దేవదై చిత్రంలో నటిస్తున్న సమయంలోనే కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఆణ్ దేవదై చిత్ర విడుదల తరువాతనే కొత్త చిత్రాలను అంగీకరించాలని నిర్ణయించుకున్నాను. కారణం ఈ చిత్రమే నేనెలాంటి పాత్రల్లో నటించాలన్నది నిర్ణయిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment