
రానా బుల్‌ఫైట్ ఇలా..
బాహుబలి సినిమా రిలీజై ఇన్నాళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఏదో ఒక రకంగా ఆ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. సినిమా విడుదలకు ముందునుంచే ప్రమోషన్ విషయంలో సరికొత్త స్ట్రాటజీ ఫాలో అయిన రాజమౌళి.. రెండో భాగం రిలీజ్ అయ్యే వరకు బాహుబలి ఫీవర్ కొనసాగేలా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల చిత్రయూనిట్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సినిమా ప్రారంభంలో రానా ఓ భారీ అడవిదున్నతో పోరాడే సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించారో.. ప్రేక్షకులకు రివీల్ చేశాడు జక్కన్న, అంత బలమైన దున్నతో రానా ఎలా తలపడ్డాడు.. ఆ సీన్ను ఎలా షూట్ చేశారన్న అంశాలను మేకింగ్లో స్పష్టంగా చూపించారు. ముఖ్యంగా ఈ ఒక్క సీన్ చూస్తే చాలు.. బాహుబలి సినిమా తెరకెక్కించటం వెనుక గ్రాఫిక్స్ మాయాజాలం ఎంత ఉందో అర్థమైపోతుంది. ఈ మేకింగ్ చూసిన ప్రేక్షకులు మరొక్కసారి వెండితెర మీద ఆ సీన్ చూడాలనుకునేలా ఉంది ఆ వీడియో. గ్రీన్‌మ్యాట్ టెక్నాలజీ వచ్చాక సినిమా ఫైటింగులలో రిస్కు చాలావరకు తగ్గిపోయిందన్న విషయాన్ని కూడా ఈ వీడియో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఏదైనా తన సినిమాను ప్రమోట్ చేసుకోవటం రాజమౌళికి తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదేమో..?