భళా బాహుబలి
సాధారణంగా చిత్రం విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణకు నోచుకుంటే రికార్డుల పర్వం మొదలవుతుంది. విడుదలకు ముందే చరిత్ర సృష్టించడం అన్నది అరుదైన విషయమే అవుతుంది. ఇక టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి సృషి బాహుబలి భారతీయ సినీ రికార్డులను బద్దలుకొట్టింది. ఆ చిత్రం లో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రదారులుగా తాజాగా రూపొం దుతున్న బాహుబలి–2 తన తొలి భాగం రికార్డులను తిరగరాయడానికి సిద్ధం అవుతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం పలు విభాగాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ప్రారంభించింది.
బాహుబలి–2 చిత్రం టీజర్ ఇటీవల విడుదలై అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ప్రపంచంలోనే 7వ స్థానంలో నిలిచిన టీజర్‌గా రికార్డుకెక్కిందని టాక్. ఈ చిత్ర శాటిలైట్ హక్కులను హిందీ వెర్షన్‌ను సోనీ సంస్థ, తెలుగు, తమిళం, మలయాళం హక్కుల్ని స్టార్ సంస్థ అత్యంత భారీ మొత్తానికి పొందినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి–2 చిత్రం భారతదేశంలోనే 6,500 థియేటర్లలో విడుదల కానుందట. విదేశాల్లో 1,750 థియేటర్లలో, అందులో అమెరికాలోనే 750 స్క్రీన్‌లలో ప్రదర్శింపబడనుందని సమాచారం.
ఇది భారతీయ సినిమాలో అనితర సాధ్యం అయిన పెద్ద రికార్డ్ అవుతుంది. ఇలా ఇప్పటికే భళా బాహుబలి అనిపించుకుంటున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏప్రిల్ 8 లేదా 9వ తేదీన చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం. అంతే కాదు ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించనున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. ఇతర భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారని తెలిసింది.