‘అన్నా ఏమైంది.. ఇలా ఉన్నారేంటి?’ | Rana Daggubati Recent Pic Leaves Fans Concerned Again | Sakshi
Sakshi News home page

‘అన్నా.. మాకోసమైనా ఆరోగ్యం కాపాడుకోండి’

Published Wed, Oct 2 2019 2:45 PM | Last Updated on Wed, Oct 2 2019 2:47 PM

Rana Daggubati Recent Pic Leaves Fans Concerned Again - Sakshi

స్టార్‌ వారసుడు, విలక్షణ నటుడు రానా దగ్గుబాటి తాజా లుక్‌ మరోసారి అభిమానులను కలవరపరుస్తోంది. సౌత్ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ రానా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోకుండా నటుడిగా, హోస్ట్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక విజువల్‌ వండర్‌ బాహుబలి సినిమాతో రానా క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. భల్లాలదేవగా నటించిన రానాకు అభిమానులు నీరాజనాలు పట్టారు. అయితే బాహుబలి తర్వాత మాత్రం రానా కెరీర్‌ స్పీడ్ తగ్గింది. 

ప్రస్తుతం విరాటపర్వం, హాథీ మేరే సాథీ సినిమాలతో బిజీగా ఉన్న రానా ఆరోగ్యం బాగా లేదనే వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. రానాకు అమెరికాలో కిడ్నీ మార్పిడి జరిగిందని, ఆయన తల్లి రానాకు కిడ్నీ దానం చేశారంటూ వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ విషయాలపై స్పందించిన రానా.. తాను ఆరోగ్యంగా ఉన్నానని పదే పదే చెప్పినా ఇలాంటి రూమర్లు ప్రచారం అవుతున్నాయని.. తనకు ఇదో బోరింగ్‌ టాపిక్‌గా మారిందని అసహనం వ్యక్తం చేశాడు. అయితే మంగళవారం రానా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటో మరోసారి అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ప్రముఖ బ్యాంకుకు సంబంధించిన మిలీనియా కార్డు గురించి చెబుతూ..‘ మిలీనియల్స్‌ జీవనశైలి సులభంగా ఉంటుందని ఎవరు చెప్పారు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మిలీనియాతో జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు అంటూ కార్డు పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోపై స్పందించిన రానా అభిమానులు.. అన్నా అసలు ఏమైంది. ఇలా ఉన్నావేంటి. మా కోసమైనా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మాకు బలంగా ఉన్న భల్లాలదేవ కావాలి. ఇలా ఎముకల గూడులా కనిపిస్తే తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement