రానా సినిమాకు రికార్డ్ ప్రైజ్..!
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా మారిన రానా, ఇప్పుడు సోలో హీరోగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. తేజ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు రానా. బాహుబలి తరువాత రానాకు ఉన్న క్రేజ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
అంతేకాదు ఈ సినిమాతో రానా మరో రికార్డ్ సృష్టించాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి కన్నా ముందు నుంచే బాలీవుడ్ కు పరిచయమున్న రానా, బాహుబలి తరువాత అక్కడ స్టార్ గా మారిపోయాడు. అందుకే ఈ సినిమా రైట్స్ ను ఏకంగా 11 కోట్లకు సొంతం చేసుకున్నారట బాలీవుడ్ నిర్మాతలు.
అత్యధికంగా మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా బాలీవుడ్ రైట్స్ 20 కోట్లు పలకగా, రానా నేనే రాజు నేనే మంత్రి రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల రిలీజ్ అయిన అల్లు అర్జున్, డీజే దువ్వాడ జగన్నాథమ్ రైట్స్ 8 కోట్లు మాత్రమే పలకటం విశేషం.