జోగేంద్రగా రానా!
తమిళసినిమా: బాహుబలి చిత్రంలో భళ్లలాదేవ పాత్రలో నటుడు రానాను ప్రపంచ సినీ ప్రేక్షకులు ఇంకా మరచిపోనేలేదు. తాజాగా జోగేంద్రగా తెరపైకి రానున్నారు. అవును సురేశ్ ప్రొడక్షన్ పతాకంపై దివంగత ప్రఖ్యాత నిర్మాత డి.రామానాయుడు దివ్యాశీసులతో డి.సురేశ్‌బాబు నిర్మిస్తున్న తాజా తెలుగు చిత్రం నేనేరాజా నేనే మంత్రి. రానా కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి కాజల్‌అగర్వాల్ నాయకిగా నటిస్తోంది. నటి క్యాథరిన్ ట్రెసా, నాజర్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి తేజా దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ నాన్ ఆణైవిట్టాళ్ పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు తేజ మాట్లాడుతూ తాను ఎంజీఆర్ వీరాభిమానినన్నారు. తమిళంలో చిత్రాలు చేయాలన్న ఆశ ఉన్నా అవకాశాలు రాలేదన్నారు. నాన్ ఆణైయిట్టాళ్ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం అని తెలిపారు. ఈ చిత్రంలో 100 మంది ఎంఎల్‌ఏలను తీసుకెళ్లి ఫామ్ హౌస్‌లో పెడితే నేనూ ముఖ్యమంత్రినవుతాననే సన్నివేశం ఉందన్నారు.ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన తరువాత తమిళనాడు రాజకీయాల్లో సరిగ్గా ఇలాంటి సంఘటనే నిజంగా జరగడం విశేషం అన్నారు.
ఎంజీఆర్ శతాబ్దిలో విడుదల
కాగా ముందుగా చిత్ర నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడిన విడియోను ప్రదర్శించారు.అందులో ఆయన పేర్కొంటూ తన తండ్రి తెలుగులో నిర్మించిన రాముడు భీముడు చిత్ర తమిళ రీమేక్‌లో ఎంజీఆర్ ఎంగవీటిపిళ్లై పేరుతో నటించారన్నారు.అందులో పచ్చైకిళ్లి ముత్తుచ్చారం అనే పాటను ఈ చిత్రంలో పొందుపరచడం విశేషంగా పేర్కొన్నారు. అప్పటి నుంచే తన తండ్రికి ఎంజీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన నటించిన ఎంగవీటి పిళ్లై చిత్రంలోని పాట పల్లవి అయిన నాన్ ఆణైయిట్టాళ్‌ను తమ చిత్రానికి పేరుగా నిర్ణయించడం, ఈ చిత్రాన్ని ఎంజీఆర్ శతాబ్ధి తరుణంలో విడుదల చేయనుండడం సంతోషంగా ఉందన్నారు.
చిత్ర కథానాయకుడు రానా మాట్లాడుతూ బాహుబలిలో భళ్లాలదేవ పాత్ర, సబ్‌మెరైన్ నేపథ్యంలో ఘాజీ వంటి చిత్రాలు చేశానని, ఇప్పుడు నటించిన నాన్ ఆణైయిట్టాళ్ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. తేజా దర్శకత్వంలో నటించడం సరి కొత్త అనుభవం అని తెలిపారు. బాహుబలి చిత్రంలో భళ్లాలదేవ కింగ్ కావాలని ఆశ పడతాడని, ఇందులో జోగేంద్ర తానే కింగ్‌గా భావిస్తాడని రానా తెలిపారు. ఇక సాధారణ యువకుడు కాంప్లెక్స్ లోకంలోకి వెళ్లితే ఎలాంటి సంఘటనలను ఎదుర్కోవలసి వస్తుందన్నదే నాన్ ఆణైయిట్లాళ్ చిత్రం అని రానా అన్నారు.