రంగనాథ్ ‘చివరి సందేశం’ | ranganath last message written on wall | Sakshi
Sakshi News home page

రంగనాథ్ ‘చివరి సందేశం’

Published Sat, Dec 19 2015 10:44 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

రంగనాథ్ ‘చివరి సందేశం’ - Sakshi

రంగనాథ్ ‘చివరి సందేశం’

ముషీరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ శనివారం ఆయన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందారు. చనిపోయే ముందు స్నేహితుడు ‘నేటినిజం’ ఎడిటర్ బైసా దేవదాసుకు 3.36గంటలకు ‘గుడ్ బై సార్’ అంటూ తన మొబైల్ నుంచి మెస్సేజ్ పెట్టారు. దీంతోపాటు తాను ఉరివేసుకున్న రూమ్ గోడలపై పెన్నుతో ‘నా బీరువాలో పనిమనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్రాబ్యాంక్ బాండ్స్‌ను ఆమెకు అప్పగించండి. 'డోంట్ ట్రబుల్ హర్' అంటూ రాశారు. శనివారం మధ్యాహ్నాం 4గంటల సమయంలో మల్కాజ్గిరిలోని గౌతమ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రంగనాధ్‌ను తీసుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు కారు తీసుకుని వచ్చారు.

వారు ఆయన కోసం వెతుకుతూ ఇంటికి చేరారు. పక్కన ఉన్న మహిళను ఇది రంగనాధ్ గారి ఇళ్లేనా అంటూ అడిగగా ఇదే అని చెప్పడంతో తలుపుతట్టారు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో పక్కంటి మహిళ, సమీపంలో నివసించే పెద్ద కుమార్తె నీరజ ఇంటికి వెళ్లి వారిని తీసుకుని వచ్చింది. అందరూ కలసి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రంగనాధ్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే సమీపంలోని నర్మదా ఆసుపత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతిచెందినట్లు వెల్లడించారు. గతంలో సబర్మతి నగర్‌లో ఉన్న రంగనాధ్ ఐదేళ్ల క్రితం సమీపంలోని 1-1-721 ఇంటిలోకి కిరాయికి దిగారు. 2009లో భార్య చైతన్య మృతిచెందడంతో ఆయన ఒంటరిగా ఉంటున్నారు. పనిమనిషి మీనాక్షి గత ఐదు సంవత్సరాలుగా రంగనాధ్‌కు సేవలు అందిస్తూ వంట చేసి పెడుతుంది. పెద్ద కూతురు నీరజ సమీపంలోని విజయబ్యాంక్ దగ్గర నివసిస్తుండగా, రెండవ కుమార్తె శైలజ బెంగళూరులో, కుమారుడు నాగు బెంగళూరులో నివసిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయన్ని గాంధీ మార్చురికీ తరలించారు. సంఘటనా స్థలంకు చిక్కడపల్లి ఏసిపి నర్సయ్య, ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్‌లు వచ్చి పరిశీలించారు.

భార్యకు గుడి కట్టిన రంగనాథ్ :
రంగనాథ్‌కు భార్య చైతన్య అంటే అమితమైన ప్రేమ. దేవతలా పూజించే వాడు. అందుకే ఇంట్లో తాను ఏర్పాటు చేసుకున్న పూజా మందిరంలో దేవుడి ఫోటోలు పక్కన భార్య చైతన్య ఫోటోను పెట్టుకున్నారు. ఈ దేవుడి ఫోటోలపై డెస్టినీ అని రాసి ఉంది. అంటే భార్య దగ్గరకు చేరుకుంటానని అనేవాడు. అలాగే పెరలాసిస్ వచ్చినప్పుడు ఆమెకు స్వయంగా ఎనలేని సేవలు చేశాడు. నిత్యం కాల్ ఫర్ గాడ్ అంటూ రంగనాథ్ అనే వారని తెలిసింది. 2009లో భార్య మరణించిన తర్వాత ఒంటరి తనాన్ని భరించలేకపోయాడు. ఎప్పుడు భార్య గురించి ఆలోచనే ఉంటూ పరాధ్యానంలో ఉండేవాడు. దానికి తోడు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ఒంటరి తనం, ఆర్థిక ఇబ్బందులతోనే రంగనాథ్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

సినీ నేపథ్యం ఇలా...
1949లో చెన్నైలో జన్మించిన రంగనాధ్ పూర్తి పేరు ‘తిరుమల సుందర శ్రీరంగనాధ్’. రైల్వేశాఖలో టిక్కెట్ కలెక్టర్(టిసీ)గా పనిచేస్తూ సినిమాపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించారు. బుద్థిమంతుడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 1974లో ‘చందన’ అనే చిత్రంలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించి పెట్టింది మాత్రం ‘పంతులమ్మ’ చిత్రం. సుమారు 300చిత్రాలకు పైగా నటించారు. పలు టివీ సీరియళ్లల్లోనూ ఆయన నటించారు. ‘మొగుడ్స్-పెళ్లామ్స్’ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 50 చిత్రాల్లో హీరోగా, మరో 50 చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రను, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకున్నారు.

రంగానాథ్ నటించిన సినిమాలు..
రంగనాథ్ నటించిన చిత్రాలు ‘అందమే ఆనందం, ఇంటింటి రామాయణం, మా ఊరి దేవత, వేట, త్రినేత్రుడు, రుద్రనేత్ర, కొదమ సింహం, కొండవీటి దొంగ, తాయారమ్మ బంగారయ్య, విజేత, రామచిలక, జమీందారి గారి అమ్మాయి, సెక్రటరీ, గృహ ప్రవేశం, ఖైదీ, దొంగ మొగుడు, చిరంజీవి, అమెరికా అమ్మాయి, లవ్ ఇన్ సింగపూర్, ప్రేమంటే ఇదేరా, దేవతలారా దీవించండి, శ్రీరామదాసు' తదితర సినిమాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement