
ముంబై : బాలీవుడ్ భామలు కంగనా రనౌత్, అలియా భట్‌ల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ గతంలో కంగనా రనౌత్‌పై చెప్పు విసిరారని ఆమె సోదరి రంగోలి చందేల్ తాజా ట్వీట్‌లో పేర్కొనడం సంచలనం రేపింది. 2006లో కంగనా రనౌత్ తాను నటించిన వాహ్ లంహే చిత్రాన్ని చూసేందుకు రాగా ఆమెపై మహేష్ భట్ చెప్పు విసిరాడని రంగోలి చందేల్ వరుస ట్వీట్లలో భగ్గుమన్నారు.
ప్రివ్యూ థియేటర్‌లోకి కంగనాను అనుమతించకుండా అమానుషంగా వ్యవహరించడంతో ఆ రాత్రంతా కంగనా ఏడుస్తూనే ఉన్నారని, అప్పుడామెకు 19 ఏళ్లు ఉంటాయని అన్నారు. తాజా ట్వీట్లతో కంగనా సోదరి రంగోలి, మహేష్ భట్ భార్య, అలియా భట్ తల్లి సోని రజ్దాన్ మధ్య సాగుతున్న ట్వీట్ వార్ మరింత ముదిరింది.
కంగనా రనౌత్‌కు అవకాశాలు ఇచ్చి తన భర్త (మహేష్ భట్) ప్రోత్సహిస్తే ఇప్పుడు ఆమె ఆయన భార్య, కుమార్తెపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని సోని రజ్దాన్ మండిపడిన విషయం తెలిసిందే. అలియా భట్‌పై గత కొంతకాలంగా వీలుచిక్కినప్పుడల్లా కంగనా రనౌత్ మండిపడుతున్నారు. తాను నటించిన మణికర్ణిక మూవీపై విమర్శకులు ప్రశంసలు కురిపించినా, అలియా మౌనం దాల్చడంపై కంగనా భగ్గుమన్నారు. అలియా భట్ నటనను చిన్నబుచ్చుతూ తనను ఆమెతో పోల్చవద్దని క్వీన్ పేర్కొనడం కూడా కంగనా, అలియా భట్‌ల మధ్య దూరాన్ని పెంచింది.