
మన చేతుల్లో ఏం లేదు
‘ఈయాల రైట్ అనుకున్నది రేపు తప్పు అవుతుంది. ఈయాల తప్పు అనుకున్నది రేపు రైట్ అవుతుంది’ అని ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో ఓ డైలాగ్. రియల్ లైఫ్‌లో ఇలాంటి డైలాగులే తమన్నా చెప్తున్నారు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సౌత్‌లో తమన్నా ఎప్పుడూ స్టార్ హీరోయినే. హిందీలో మాత్రం ఒక్క హిట్టు లభిస్తే ఒట్టు. చేసిన మూడు సినిమాలూ ఫట్‌మన్నాయి. అందుకే అక్కడ స్టార్ లిస్ట్‌లో చేరలేకపోతున్నారు.
ఇదే విషయాన్ని తమన్నా దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘హిందీలో మీకు హిట్ ఎందుకు రాలేదు? అనే ప్రశ్న నన్నెప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘హిమ్మత్‌వాలా’, ‘హమ్‌షకల్స్’ సక్సెస్ అవుతాయనుకున్నాను. కానీ, నా నమ్మకం నిజం కాలేదు. ఒక్కోసారి మన నిర్ణయం రైట్ అనుకుని సినిమాకి సంతకం చేస్తాం.
అది కాస్తా తప్పవుతుంది. మన చేతుల్లో ఏం లేదు. అంతమాత్రాన హిందీలో నాకు దారులు మూసుకు పోయాయ్ అని కాదు’’ అని తమన్నా పేర్కొన్నారు. ఇటీవల ఆమె ఓ హిందీ సినిమా అంగీకరించారు. రణ్‌వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఆ సినిమా హిట్ తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారామె. మరి.. తమన్నా నమ్మకం నిజమవుతుందా?