
ఎవరి ప్లేస్ వాళ్లదే!
రన్నింగ్ రేసులో స్పీడుగా పరిగెడితే... మీకు గోల్డ్ మెడల్ వస్తుందని గ్యారెంటీ ఇవ్వొచ్చు. కానీ, సినిమా ఇండస్ట్రీ రేసులో మీరెంత పరుగు తీసినా గోల్డెన్ లెగ్ అనే పేరొస్తుందని గ్యారెంటీ ఇవ్వలేం! వర్క్‌తో పాటు లక్ కూడా కీ రోల్ ప్లే చేస్తుందని కొందరి అభిప్రాయం. రాశీఖన్నా మాత్రం ఇటువంటి మాటలను అస్సలు పట్టించుకోరట! ‘‘ఒక్కోసారి డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరక మంచి సినిమాలో నటించే ఛాన్స్ మరొకరికి వెళ్తుంది. అందులో ఆ అమ్మాయి నటించుంటేనా? స్టార్‌డమ్ మరింత పెరిగేది. పాపం... మంచి ఛాన్స్ మిస్ అయ్యిందనే మాటలు వినిపిస్తాయి. నా దృష్టిలో ఇక్కడ ప్రతి ఒక్కరూ పైకి ఎదగడానికి ఛాన్స్ ఉంది.
కాస్త ముందూ వెనుకా అవుతుందంతే. ఎవరికి పేరొచ్చినా సంతోషించే మనస్తత్వం నాది. వేరొకరి ఉన్నతిని చూసి అసూయ చెందే రకం కాదు. ఎవరూ ఎవర్నీ తొక్కేయడానికి ప్రయత్నించరు. ఎవరి ప్లేస్ వాళ్లదే. నా ప్లేస్ నాదే’’ అన్నారు రాశీ ఖన్నా. తెలుగులో రకుల్, సమంత, లావణ్యా త్రిపాఠి, హిందీలో వాణీ కపూర్.. ఇలా సినిమా ఇండస్ట్రీలో రాశీ స్నేహితుల జాబితా పెద్దదే.
వాళ్లతో ఈ బ్యూటీ తనను ఎప్పుడూ కంపేర్ చేసుకోరట! ఇక, సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జై లవకుశ’, రవితేజ ‘టచ్ చేసి చూడు’, గోపీచంద్ ‘ఆక్సిజన్’లలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా నటించే సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. ఈ ఏడాది తమిళ, మలయాళ రంగాలకు కూడా రాశీ ఖన్నా పరిచయం కానున్నారు. ఎక్కడికెళ్లినా ముందుగా అవకాశం ఇచ్చిన తెలుగు పరిశ్రమ తనకెంతో స్పెషల్ అంటున్నారీ బ్యూటీ. సో.. స్వీట్ కదూ!