
‘‘బయట నుంచి చూసే కొందరికి నటన చాలా ఈజీ కదా అనుకుంటారు. కానీ అంత ఈజీ కాదు. యాక్టింగ్ అనేది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. సెట్‌కు వెళ్లిన ప్రతిరోజూ పరీక్షే’’ అన్నారు రష్మికా మండన్నా. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా రష్మికా మండన్నా చెప్పిన విశేషాలు.
బాబీ (సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర పేరు) అండ్ లిల్లీ (రష్మికా పాత్ర పేరు)ల జర్నీ ఈ సినిమా. ఇందులో జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాలనే లక్ష్యం ఉన్న రాష్ట్ర స్థాయి క్రికెట్ క్రీడాకారిణి లిల్లీ పాత్రలో నటించాను. ఈ పాత్ర కోసం చాలా సాధన చేశా. గాయాలు కూడా అయ్యాయి. ముఖ్యంగా క్రికెటర్ల బాడీ లాంగ్వేజ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వచ్చింది.
ఈ సినిమాకు ముందు నా జీవితంలో క్రికెట్ ఆడలేదు. క్రికెట్ గురించి కూడా అంతగా తెలియదు. లిల్లీ పాత్ర వల్ల క్రికెట్ పట్ల అవగాహన కలిగింది. సిక్సులు తక్కువ, ఫోర్లు ఎక్కువగా కొట్టాను. ఇప్పుడు క్రికెట్ ఆడితే నా వికెట్‌ను నేను కాపాడుకోగలననే నమ్మకం కలిగింది. ఆన్‌డ్రైవ్, ఆన్‌సైడ్, ఆఫ్‌సైడ్.. ఇలా క్రికెట్ టెర్మినాలజీ గురించి కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాను. తొలిసారి క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లను చూశాను. సెమీ ఫైనల్‌లో ధోనీ రనౌట్ నన్ను బాధించింది. చూస్తున్న మనకే ఇలా ఉంటే ఆ టైమ్‌లో గ్రౌండ్‌లో క్రికెట్ అడుతున్నవారికి ఇంకెంత ఆందోళనగా ఉంటుందో కదా అనిపించింది.
‘గీతగోవిందం’ సినిమా హిట్ సాధించింది కాబట్టి మళ్లీ విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని
ఈ సినిమా ఒప్పుకోలేదు. దర్శకుడు భరత్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రం చేయడానికి అంగీకరించాను. ఈ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఆసక్తికరంగా అనిపించింది. లిల్లీ పాత్ర జ్ఞాపకశక్తి కోల్పోతుందా? అంటే ఆ విషయం గురించి ఇప్పుడు చెప్పను. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
మంచి స్క్రిప్ట్స్‌తో వస్తున్న కొత్త దర్శకులతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మైత్రీ బేనర్, భరత్‌సార్‌తో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కావడం ఎగై్జటింగ్‌గా ఉంది. కన్నడ, తెలుగు వెర్షన్స్‌కు నేనే డబ్బింగ్ చెప్పాను. ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్‌లో పూర్తిగా లీనమైపోతాను. కానీ సెట్‌లో సీన్ అయిపోయిందని యూనిట్ సందడి చేయడం మొదలుపెడితే అప్పుడు ఆ మూడ్ నుంచి బయటకు వస్తాను. కానీ పర్సనల్‌గా కొన్ని క్యారెక్టర్స్‌కు మాత్రమే కనెక్ట్ అవుతాం.
పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడాన్ని నేను కేవలం లక్ అనుకోవడం లేదు. హార్డ్‌వర్క్‌ని నమ్ముతాను. ఎవరైనా ఏదైనా నాకు రాదని చెబితే.. తిరిగి నేనేమీ అనను. చేసి చూపిస్తా. అందుకోసం ఎంతైనా కష్టపడతాను. కెరీర్‌లో ముందుకు వెళ్తూ, లాంగ్ రన్‌ను ఏర్పాటు చేసుకోవాలంటే కష్డపడాల్సిందే. ఇండస్ట్రీలోని ప్రతి హీరోయిన్‌కి వారి పర్సనల్ స్టేటస్ గురించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. నా వరకైతే లొకేషన్‌కు వెళ్లి షూటింగ్‌లో పాల్గొనడం, వర్కౌట్స్, షెడ్యూల్స్ ప్లానింగ్ వీటితోనే గడిచిపోతోంది. ఖాళీ సమయం లేదు. కొన్ని సార్లు తినడం కూడా మర్చిపోతున్నాను. భోజనం టైమ్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది.. అయ్యో.. ఈ రోజు నేను తినలేదు కదా అని. ఇక నా పర్సనల్ విషయానికి వస్తే నేను సింగిలే.
కన్నడలో సినిమాలు చేయడాన్ని నేను తగ్గించలేదు. కరెక్ట్‌గా డేట్స్ ఇస్తే ఏడాదిలో నాలుగు సినిమాలు చేయవచ్చు. నేను చేయాల్సిన సినిమాలను స్క్రిప్ట్స్ పరంగా ఎంచుకుంటున్నాను. కన్నడలో ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. షూటింగ్ ఆలస్యం కావడం, విడుదల తేదీలాంటి విషయాలు నా చేతిలో ఉండవు.
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్‌బాబుగారితో వర్క్ చేయబోతున్నాను. ఇంకా నా పాత్ర షూటింగ్ ఆరంభం కాలేదు. దానికోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నితిన్ ‘భీష్మ’ షూటింగ్ ఫుల్ మస్తీగా సాగుతోంది. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయనున్నా. తమిళంలో కార్తీ సరసన ఓ సినిమా చేయబోతున్నాను. మరొక సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment