అవార్డును స్వీకరిస్తున్న బోనీ కపూర్, జాన్వీ, ఖుషీ
న్యూఢిల్లీ: గతేడాది విజయవంతమైన మామ్ చిత్రంలోని నటనకు గానూ శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటి అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును శ్రీదేవి కుటుంబ సభ్యులు బోనీ కపూర్, జాన్వీ, ఖుషీలు అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 65వ జాతీయ చలనచిత్రోత్సవం అవార్డులను ఏప్రిల్ 13న ప్రకటించిన విషయం విదితమే. ముందుగానే నిర్ణయించిన షెడ్యుల్ కారణంగా... రామ్‌నాథ్ కోవింద్ ఈ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఏఆర్ రెహ్మాన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అందుకున్నారు.
ప్రతి ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగానే అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. అయితే దీనికి భిన్నంగా రాష్ట్రపతి కోవింద్ మాత్రం గంట సమయాన్నే వెచ్చించారు. మిగతా అవార్డులను సంబంధింత మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ప్రదానం చేస్తారని తెలిపారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన అవార్డు గ్రహీతలు కంగుతిన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తారు కాబట్టే వీటికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. అలాంటిది రాష్ట్రపతి కార్యక్రమంలో మధ్యలోనే వెళ్లిపోవడంతో అవార్డు గ్రహీతలు నిరసన వ్యక్తం చేశారు. కేవలం 11 మందికి మాత్రమే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment