బొమ్మరిల్లు బ్యానర్లో... బాబీ దర్శకత్వంలో...
తన కెరీర్‌లో ఎన్ని విజయాలున్నా ‘బలుపు’ విజయం మాత్రం రవితేజకు ప్రత్యేకం. ఎందుకంటే... ఆ ఒక్క విజయం ఆయనకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. ‘బలుపు’ విజయంలో కీ రోల్ ప్లే చేసింది ఆ సినిమా సంభాషణలు. అందులోని రవితేజ మార్క్ పంచ్ డైలాగులు డైనమేట్లలా పేలాయన్నది నిజం. అందుకే అనుకుంటా... ఆ సినిమాకు సంభాషణలు అందించిన బాబీని రవితేజ దర్శకుణ్ణి చేసేశారు.
రవితేజతో ‘నిప్పు’లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన వైవీఎస్ చౌదరి ‘బొమ్మరిల్లు’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిరాడంబరంగా జరిగాయి. ఇప్పటివరకూ వచ్చిన రవితేజ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.
బాబీ కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనుందని సమాచారం. రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా వైవీఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కథానాయిక, ప్రధాన తారాగణం వివరాలతో పాటు షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది త్వరలోనే అధికారికంగా తెలియనుంది.