
పంజగుట్ట: ఇటీవలే విడుదలైన అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని సన్నివేశాలు రాయలసీమను అవమానపరిచేలా ఉన్నాయని, వెంటనే ఆ సన్నివేశాలు తొలగించి చిత్ర దర్శకుడు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి డిమాండ్ చేసింది. రాయలసీమలో ఎంతో కరువు ఉందని, వేలమంది వలసలు వెళుతున్నారన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, దేశంలో అతితక్కువ వర్షాభావం ఇక్కడే ఉంది వీటిపై సినిమాలు తీయకుండా కేవలం ఫ్యాక్షన్ అంటేనే రాయలసీమ అని సినిమాల్లో చూపించి నేటితరం యువతకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో వివరించాలన్నారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షులు కె.రవికుమార్, రాయలసీమ ఉద్యమ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఖానాపురం కృష్ణారెడ్డి, రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు సీమ క్రిష్ణ, రాయలసీమ యూత్ ఫ్రంట్ ప్రతినిధి జలం శ్రీనులు మాట్లాడుతూ .. సినిమాలో ఫ్యాక్షన్ మా డీఎన్‌ఏలో ఉంది, కొండారెడ్డి బురుజు, అనంతపురం టవర్ క్లాక్, కడప కోటిరెడ్డి సర్కిల్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలను ఉటంకిస్తూ తరిమి తరిమి నరుకుతానని హీరోచేత చెప్పించడం రాయలసీమ ప్రజలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ఫ్యాక్షన్ మా డీఎన్‌ఏలో ఉందని డైరెక్టర్‌కు ఎలా తెలుసు అని, అతను సీమప్రాంతానికి చెందినవాడా ..? ప్రశ్నించారు. ఎక్కడో బ్యాంకాక్‌లో కూర్చుని కథలు రాయడంకాదు, సీమకు వచ్చి ఇక్కడ స్థితిగతులు తెలుసుకుని సినిమాలు తీయాలని సూచించారు.
యువకులు ఉన్నత చదువులు చదువుకుని వలసలు పోతున్నారని, సినిమాల ప్రభావం వల్ల కడప, కర్నూలు, అనంతపురం అంటేనే ఇతర నగరాల్లో రూంలు అద్దెకు కూడా ఇవ్వడంలేదని, కడప యూనివర్సిటీలో సీట్లు వస్తే చదువుకోవడానికి కూడా వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జబర్‌దస్త్‌షోలో కూడా రాయలసీమ మట్టి అని మట్టి తినిపించడం, రాయలసీమ నీరు తాగితే పౌరుషం వస్తుందంటూ మురికినీరు తాగించడం చేస్తున్నారని ఇప్పటికైనా సినిమాల్లో, షోలల్లో రాయలసీమను కించపరిచేలా చిత్రీకరించరాదని, ఇదే విషయమై ఫిలించాంబర్‌లో వినతిపత్రం ఇవ్వనున్నట్లు అప్పటికీ స్పందించపోతే రాయలసీమలో సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్
Comments
Please login to add a commentAdd a comment