Rayalaseema Students Union
-
చంద్రబాబును అడ్డుకుంటాం
కర్నూలు(అర్బన్): పరిపాలనా వికేంద్రీకరణను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను రాయలసీమ జిల్లాల్లో అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆర్‌యూఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా రాయలసీమకు అన్యాయం చేశారన్నారు. బాబు బస్సు యాత్రను అడ్డుకుంటాం విజయనగరం పూల్‌బాగ్: ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు విరుద్ధంగా చంద్రబాబు చేసే బస్సు యాత్రను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు హెచ్చరించారు. విజయనగరంలోని సంఘం కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విశాఖకు రాజధాని రాకుండా కుట్రలు చేస్తున్నారని, వ్యక్తిగత అక్కసుతో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వల్లే ఉత్తరాంధ్ర నుంచి లక్షలాది కుటుంబాలు వలస వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. విశాఖకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారికి సిగ్గుందా? విశాఖకు రాజధాని వస్తుందంటే స్వాగతించాల్సింది పోయి దుష్ప్రచారం చేస్తున్న వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులే. విశాఖ దూరాభారం అవుతుందని చేస్తు్తన్న దుష్ప్రచారం నిజం కాదు. హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత వాసులు వెళ్లలేదా? విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నాం. - ఉత్తరాంధ్ర చైతన్య వేదిక చైర్మన్ ఎస్ఎస్ శివశంకర్, ప్రతినిధి బలగా ప్రకాష్ తదితరులు (డాబాగార్డెన్స్–విశాఖ దక్షిణ) -
‘అరవింద సమేత’లో సీమకు అవమానం
పంజగుట్ట: ఇటీవలే విడుదలైన అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని సన్నివేశాలు రాయలసీమను అవమానపరిచేలా ఉన్నాయని, వెంటనే ఆ సన్నివేశాలు తొలగించి చిత్ర దర్శకుడు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి డిమాండ్ చేసింది. రాయలసీమలో ఎంతో కరువు ఉందని, వేలమంది వలసలు వెళుతున్నారన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, దేశంలో అతితక్కువ వర్షాభావం ఇక్కడే ఉంది వీటిపై సినిమాలు తీయకుండా కేవలం ఫ్యాక్షన్ అంటేనే రాయలసీమ అని సినిమాల్లో చూపించి నేటితరం యువతకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో వివరించాలన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షులు కె.రవికుమార్, రాయలసీమ ఉద్యమ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఖానాపురం కృష్ణారెడ్డి, రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు సీమ క్రిష్ణ, రాయలసీమ యూత్ ఫ్రంట్ ప్రతినిధి జలం శ్రీనులు మాట్లాడుతూ .. సినిమాలో ఫ్యాక్షన్ మా డీఎన్ఏలో ఉంది, కొండారెడ్డి బురుజు, అనంతపురం టవర్ క్లాక్, కడప కోటిరెడ్డి సర్కిల్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలను ఉటంకిస్తూ తరిమి తరిమి నరుకుతానని హీరోచేత చెప్పించడం రాయలసీమ ప్రజలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ఫ్యాక్షన్ మా డీఎన్ఏలో ఉందని డైరెక్టర్‌కు ఎలా తెలుసు అని, అతను సీమప్రాంతానికి చెందినవాడా ..? ప్రశ్నించారు. ఎక్కడో బ్యాంకాక్‌లో కూర్చుని కథలు రాయడంకాదు, సీమకు వచ్చి ఇక్కడ స్థితిగతులు తెలుసుకుని సినిమాలు తీయాలని సూచించారు. యువకులు ఉన్నత చదువులు చదువుకుని వలసలు పోతున్నారని, సినిమాల ప్రభావం వల్ల కడప, కర్నూలు, అనంతపురం అంటేనే ఇతర నగరాల్లో రూంలు అద్దెకు కూడా ఇవ్వడంలేదని, కడప యూనివర్సిటీలో సీట్లు వస్తే చదువుకోవడానికి కూడా వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జబర్దస్త్షోలో కూడా రాయలసీమ మట్టి అని మట్టి తినిపించడం, రాయలసీమ నీరు తాగితే పౌరుషం వస్తుందంటూ మురికినీరు తాగించడం చేస్తున్నారని ఇప్పటికైనా సినిమాల్లో, షోలల్లో రాయలసీమను కించపరిచేలా చిత్రీకరించరాదని, ఇదే విషయమై ఫిలించాంబర్‌లో వినతిపత్రం ఇవ్వనున్నట్లు అప్పటికీ స్పందించపోతే రాయలసీమలో సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్ -
'ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి'
తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాయలసీమ విద్యార్థి సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం తిరుపతిలో ప్రత్యేక హోదా కోరుతూ రాయలసీమ విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. ప్రత్యేక హోదా కోసం మునికోటి ఆత్మాహుతికి నిరసనగా ఈ రోజు తిరుపతిలో విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని కళాశాల విద్యార్థులంతా ర్యాలీ నిర్వహించారు. -
రాజధానికోసం పోరు
కడప సెవెన్‌రోడ్స్ : రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడు తూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనందున సీమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో గళం విప్పాలన్నారు. సీమలో రాజధాని ఏర్పాటుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. సీమ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలన్నారు. సీమకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీని వేదికగా చేసుకొని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు పోరాడాలన్నారు. లేదంటే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని వెళ్లడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు జయవర్దన్, ఉపాధ్యక్షుడు జకరయ్య, నాయకులు మల్లికార్జున, సుబ్బరాజు, నాగరాజు, నాయక్, ప్రసన్న తదితరులు అదుపులోకి తీసుకున్నారు. -
‘సీమ’పై ఇంత నిర్లక్ష్యమా?
కడప సెవెన్‌రోడ్స్: రాయలసీమపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో ప్రదర్శన చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్ఎస్యూ నాయకులు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగాక 1956కు పూర్వం ఉన్న విధంగానే కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయడం న్యాయమన్నారు. శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తికి భిన్నంగా శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేయించారని విమర్శించారు. కమిటీ నివేదిక ఇంకా వెలువడక ముందే కోస్తాంధ్ర నాయకులు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కోస్తా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారని ధ్వజమెత్తారు. ఐటీ, ఫార్మా కంపెనీలతోపాటు కేంద్రం మంజూరు చేసిన జాతీయస్థాయి సంస్థలన్నీ కోస్తాలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సీమ పరిస్థితులను గమనించి న్యాయం చేయాలని కోరారు. రాజధాని కోసం ఉద్యమిస్తాం వైవీయూ : శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాష్ట్ర రాజధానిని నిర్మించకుంటే మరో ఉద్యమం తప్పదని రాయలసీమ విద్యార్థి వేదిక నాయకులు అన్నారు. సోమవారం ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ నాయకులు ఉదయం నుంచే యోగివేమన విశ్వవిద్యాలయం, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలను మూసివేయించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దస్తగిరి మాట్లాడుతూ ఒకవైపు రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ జిల్లాలను సందర్శిస్తుంటే మరోవైపు మంత్రులు విజయవాడ-గుంటూరు మధ్యే అంటూ సీమవాసులను రెచ్చగొడుతున్నారన్నారు. మరోవైపు కోస్తా ప్రాంత ఓట్లే కీలకమనుకుంటూ సీమను నిర్లక్ష్యం చేస్తున్నార ని ధ్వజమెత్తారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం నగరాలు లేని ప్రాంతం రాయలసీమేనని, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మేల్కొని సీమలోనే రాజధాని ఏర్పాటయ్యేలా కృషిచేయాలని కోరారు. ఆర్ఎస్ఎఫ్ నాయకులు ప్రతాప్, సురేంద్ర, హరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో బంద్.. యోగివేమన విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎఫ్ యూనివర్సిటీశాఖ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ నాగార్జున మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు విద్యార్థి ఉద్యమమే నాంది అవుతుందని తెలిపారు. అనంతరం తరగతులు బహిష్కరించి బంద్ పాటించారు.