‘సీమ’పై ఇంత నిర్లక్ష్యమా?
కడప సెవెన్‌రోడ్స్: రాయలసీమపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో ప్రదర్శన చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్‌ఎస్‌యూ నాయకులు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగాక 1956కు పూర్వం ఉన్న విధంగానే కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయడం న్యాయమన్నారు. శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తికి భిన్నంగా శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేయించారని విమర్శించారు.
కమిటీ నివేదిక ఇంకా వెలువడక ముందే కోస్తాంధ్ర నాయకులు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కోస్తా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారని ధ్వజమెత్తారు. ఐటీ, ఫార్మా కంపెనీలతోపాటు కేంద్రం మంజూరు చేసిన జాతీయస్థాయి సంస్థలన్నీ కోస్తాలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సీమ పరిస్థితులను గమనించి న్యాయం చేయాలని కోరారు.
రాజధాని కోసం ఉద్యమిస్తాం
వైవీయూ : శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాష్ట్ర రాజధానిని నిర్మించకుంటే మరో ఉద్యమం తప్పదని రాయలసీమ విద్యార్థి వేదిక నాయకులు అన్నారు. సోమవారం ఆర్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకులు ఉదయం నుంచే యోగివేమన విశ్వవిద్యాలయం, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలను మూసివేయించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ దస్తగిరి మాట్లాడుతూ ఒకవైపు రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ జిల్లాలను సందర్శిస్తుంటే మరోవైపు మంత్రులు విజయవాడ-గుంటూరు మధ్యే అంటూ సీమవాసులను రెచ్చగొడుతున్నారన్నారు.
మరోవైపు కోస్తా ప్రాంత ఓట్లే కీలకమనుకుంటూ సీమను నిర్లక్ష్యం చేస్తున్నార ని ధ్వజమెత్తారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం నగరాలు లేని ప్రాంతం రాయలసీమేనని, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మేల్కొని సీమలోనే రాజధాని ఏర్పాటయ్యేలా కృషిచేయాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకులు ప్రతాప్, సురేంద్ర, హరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయంలో బంద్..
యోగివేమన విశ్వవిద్యాలయంలో ఆర్‌ఎస్‌ఎఫ్ యూనివర్సిటీశాఖ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ నాగార్జున మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు విద్యార్థి ఉద్యమమే నాంది అవుతుందని తెలిపారు. అనంతరం తరగతులు బహిష్కరించి బంద్ పాటించారు.