Ravi shankar reddy
-
పల్నాడు జిల్లా ఎస్పీ వినూత్న ఆలోచన వ్యవసాయంలో ఎంతో మందికి ఆదర్శం
-
ఎరుపెక్కిన కడప దారులు
కడప అగ్రికల్చర్ : మేడేను పురస్కరించుకుని కడపలోని ప్రధాన రహదారులు ఎరుపెక్కాయి. శుక్రవారం సాయంత్రం కడప నగరంలో ట్రేడ్ యూనియన్లు ర్యాలీలు నిర్వహించాయి. సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, అనుబంధ సంఘాలతో కార్పొరేషన్ కార్యాలయం, జెడ్పీ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి వరకు డప్పు వాయిద్యాలు, కర్ర విన్యాసాలతో ఆయా సభా స్థలాలకు చేరుకున్నారు. మహిళలు ఎర్ర చీరెలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రేడ్ యూనియన్ల జెండాలతో కార్మికులు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ర్యాలీలో కార్మిక గీతాలను ఆలపించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నగర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, ఐఎన్‌సుబ్బమ్మ, రాజకుళ్లాయమ్మ, రామలక్షుమ్మ, లక్ష్మిదేవి, మనోహర్, సిద్దిరామయ్య, పాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఓ.శివశంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సీమ’పై ఇంత నిర్లక్ష్యమా?
కడప సెవెన్‌రోడ్స్: రాయలసీమపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో ప్రదర్శన చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్ఎస్యూ నాయకులు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగాక 1956కు పూర్వం ఉన్న విధంగానే కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయడం న్యాయమన్నారు. శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తికి భిన్నంగా శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేయించారని విమర్శించారు. కమిటీ నివేదిక ఇంకా వెలువడక ముందే కోస్తాంధ్ర నాయకులు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కోస్తా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారని ధ్వజమెత్తారు. ఐటీ, ఫార్మా కంపెనీలతోపాటు కేంద్రం మంజూరు చేసిన జాతీయస్థాయి సంస్థలన్నీ కోస్తాలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సీమ పరిస్థితులను గమనించి న్యాయం చేయాలని కోరారు. రాజధాని కోసం ఉద్యమిస్తాం వైవీయూ : శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాష్ట్ర రాజధానిని నిర్మించకుంటే మరో ఉద్యమం తప్పదని రాయలసీమ విద్యార్థి వేదిక నాయకులు అన్నారు. సోమవారం ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ నాయకులు ఉదయం నుంచే యోగివేమన విశ్వవిద్యాలయం, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలను మూసివేయించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దస్తగిరి మాట్లాడుతూ ఒకవైపు రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ జిల్లాలను సందర్శిస్తుంటే మరోవైపు మంత్రులు విజయవాడ-గుంటూరు మధ్యే అంటూ సీమవాసులను రెచ్చగొడుతున్నారన్నారు. మరోవైపు కోస్తా ప్రాంత ఓట్లే కీలకమనుకుంటూ సీమను నిర్లక్ష్యం చేస్తున్నార ని ధ్వజమెత్తారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం నగరాలు లేని ప్రాంతం రాయలసీమేనని, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మేల్కొని సీమలోనే రాజధాని ఏర్పాటయ్యేలా కృషిచేయాలని కోరారు. ఆర్ఎస్ఎఫ్ నాయకులు ప్రతాప్, సురేంద్ర, హరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో బంద్.. యోగివేమన విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎఫ్ యూనివర్సిటీశాఖ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ నాగార్జున మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు విద్యార్థి ఉద్యమమే నాంది అవుతుందని తెలిపారు. అనంతరం తరగతులు బహిష్కరించి బంద్ పాటించారు. -
కన్నతల్లే కడతేర్చమంది !
‘మనమైనా చావాలి..నా కొడుకునైనా చంపేయాలి’ తమ సంబంధం బయటపడుతుందని..తల్లే తన కొడుకుని చంపేయమంది ఆటో డ్రైవరే కీలక నిందితుడు సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా గుర్తింపు చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ‘‘మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం భయడపడకూడదనుకుంటే మనమైనా చావాలి.. లేదా నా కొడుకునైనా చంపేయాలి’’ అంటూ ఓ తల్లి తన స్నేహితుడికి నూరిపోసింది. ఇదే అదునుగా అతను ఆమె కొడుకును కడతేర్చేశాడు. చిన్నారి మురళీధర్ రెడ్డి హత్యకేసును పోలీసు లు ఎట్టకేలకు ఛేదించారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ విషయాలను డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం అలిపిరి పోలీసుస్టేషన్లో విలేకరులకు తెలియజేశారు. వెదురుకుప్పం మండలం కుమ్మరగుంట గ్రామానికి చెందిన మునిరత్నం రెడ్డి తిరుమలలో అటెండర్‌గా పనిచేస్తూ స్థానిక సత్యనారాయణపురంలో కాపురముంటున్నాడు. ఆయనకు భార్య అరుణ, కొడుకు మురళీధర్‌రెడ్డి, కూతురు హేమశ్రీ ఉన్నారు. వీరి ఇంటికి ఎదురుగా వెదురుకుప్పం మండలం దేవళంపేట పంచాయతీ రామకృష్ణాపురానికి చెందిన సీ సోమశేఖరరాజు కుటుంబం నివాసముంటోంది. 17 ఏళ్ల క్రితం తిరుపతికి వచ్చిన సోమశేఖరరాజు ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో కొనుగోలు కోసం మునిరత్నంరెడ్డి ఆయనకు రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. సోమశేఖరరాజు భార్య ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇదే స్కూల్లో మునిరత్నంరెడ్డి పిల్లలు చదువుకుంటున్నారు. మునిరత్నంరెడ్డి పిల్లలను ప్రతిరోజూ సోమశేఖర్రాజు తన ఆటోలోనే తీసుకెళ్లి స్కూల్లో వదిలేవాడు. రెండు కుటుంబాల మధ్య ఆరేళ్లుగా సాన్నిహిత్యం పెరిగింది. ఏడాది క్రితమే మునిరత్నంరెడ్డి కారును కొన్నారు. ఆ కారుకు తరచూ సోమశేఖర్రాజు డ్రైవర్‌గా వెళ్లేవాడు. రెండు కుటుంబాల వారు కలిసి గుళ్లుగోపురాలకు వెళ్లేవారు. ఆ సాన్నిహిత్యంతో సోమశేఖర్రాజుకు డబ్బు అవసరమైనప్పుడు మునిరత్నం రెడ్డి భార్య అరుణ ఇస్తుండేది. సోమశేఖర్రాజు భార్యాపిల్లలు కొన్ని రోజుల క్రితం పీలేరుకు వెళ్లారు. ఇంట్లో సోమశేఖర్రాజు ఒక్కడే ఉంటున్నాడు. ప్రతి రోజూ అరుణ ఆయన ఇంటికెళ్లి భోజనం ఇచ్చి వచ్చేది. గతనెల 28న అరుణ, సోమశేఖర్రాజు ఇంట్లో ఉండగా మునిరత్నంరెడ్డి కొడుకు మురళీధర్‌రెడ్డి కిటికీలో నుంచి చూశాడు. 30వ తేదీన అరుణ సోమశేఖర్రాజు ఇంటికెళ్లి ఈ విషయం గురించి తన కొడుకు ఇంట్లో చెబితే ఇద్దరికీ ప్రాణాపాయం ఉంటుందని చె ప్పింది. ‘‘మనమిద్దరమైనా చనిపోదాం, లేకుంటే నా కొడుకునైనా చంపేయాలి’’ అంటూ సోమశేఖర్రాజుకు చెప్పింది. అరుణ సూచన మేరకు 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇంటి బయట ఆడుకుంటున్న మురళీధర్‌రెడ్డిని ఆటోలో కపిలతీర్థం మార్గంలో జూపార్కు మీదుగా చెర్లోపల్లి పెట్రోల్ బంకు వరకు వెళ్లాడు. అక్కడ రూ.150కు బాటిల్లో పెట్రోల్ పట్టుకుని తొండవాడ క్రాస్, డోర్నకంబాల మీదుగా చవటగుంట వరకు వెళ్లాడు. చీకటి పడ్డాక శానంబట్ల మెటల్ రోడ్డులోని ఓ మామిడి తోపునకు సమీపంలోని ముళ్ల పొదల వద్దకు మురళీధర్‌రెడ్డిని తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని గుర్తు పట్టలేని విధంగా పెట్రోల్ పోసి దహనం చేశాడు. అక్కడి నుంచి అదేరోజు రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు మురళీధర్‌రెడ్డి కోసం సోమశేఖర్రాజు అందరితోపాటు వెతుకుతూ ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించాడు. 30వ తేదీ రాత్రి అలిపిరి పోలీసు స్టేషన్లో తమ పిల్లాడు తప్పిపోయినట్లు మురళీధర్‌రెడ్డి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 31వ తేదీ ఉదయం డోర్నకంబాల మెటల్ రోడ్డులో ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరిపిన అలిపిరి పోలీసులు సోమశేఖర్రాజును అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. మరింత లోతుగా దర్యాప్తు జరిపి చిన్నారి తల్లి అరుణను కూడా అరెస్ట్ చేయనున్నారు. శభాష్ పోలీసు.. వారం రోజుల్లో చిన్నారి హత్య కేసును ఛేదించి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో విచారణ ఆలస్యం కావడం పరిపాటి. ఈ కేసులో మాత్రం ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, అలిపిరి సీఐ రాజశేఖర్ తమదైన ప్రత్యేకతను కనబరిచి ప్రధాన నిందితుడైన ఆటోడ్రైవర్ సీ.సోమశేఖరరాజును అరెస్ట్ చేశారు. -
సమైక్య సంఘీభావం
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ పార్టీల నేతలు కాకుండా విద్యార్థులే నాయకత్వం వహించేందుకు కళాశాలలు వదిలి బయటికి రావాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్షలు జరిగాయి. విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటే మూడు ప్రాంతాలు బాగుపడతాయని, విడిపోతే తెలంగాణ మాత్రమే బాగు పడుతుందని చెప్పారు. సీమాంధ్ర విద్యార్థులు ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి పేరున్న ఇంజనీరింగ్ లేదా మెడికల్ కళాశాలల్లో చేరాలంటే అన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని తెలిపారు. కోచింగ్‌సెంటర్లు కూడా అక్కడే ఉన్నాయని చెప్పారు. వృత్తి విద్యకోర్సులు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాలనుకున్నా ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా రాష్ట్ర రాజధానిలోనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అభివృద్ధి రాజధానిలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా జరిగిందన్నారు. కానీ, మన రాష్ట్రంలో మాత్రమే అభివృద్ధి అంతా హైదరాబాదులో జరిగిందన్నారు. రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ హైదరాబాదునే అభివృద్ధి చేశారంటే అది తెలుగు ప్రజలందరిదీ అన్న భావనే కారణమన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోరుతూ ఫిబ్రవరి 9వ తేది హైదరాబాదులో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజా వేదిక కన్వీనర్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును ఓడించి పంపాల్సిన బాధ్యత సీమాంధ్ర ఎమ్మెల్యేలపై ఉందన్నారు. రాజధాని నగరం అభివృద్ధి చెందడానికి సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణలో నక్సల్స్ సమస్యను నిర్మూలించడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారనే విషయాన్ని తెలంగాణ వాదులు విస్మరించరాదని చెప్పారు. రాజకీయ జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శాసనసభకు వచ్చిన రాష్ట్ర విభజన బిల్లు చర్చార్హం కాదన్నారు. రాజ్యాంగ బద్దంగా లేని తప్పుల తడక బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపాలన్నారు. బిల్లును తిరస్కరించకపోతే సీమాంధ్ర ప్రజాప్రతినిధులను ప్రజలు తిరస్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవర్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, జేఏసీ నాయకులు సీఆర్ఐ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నీలి శ్రీనివాసరావు, , రాజోలి వీరారెడ్డి, ఎన్ఆర్ఐ ట్రస్టు అధ్యక్షుడు తోట కృష్ణ, కందుల విద్యా సంస్థల డెరైక్టర్ ప్రొఫెసర్ కేఎస్ఎన్ రెడ్డి, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు వెంకట్రామిరెడ్డి, బీఎన్ బాబు, చిన్న సుబ్బయ్య, విద్యుత్ జేఏసీ నాయకులు భద్రయ్య, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం నాయకుడు జోగిరామిరెడ్డి, మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.