కన్నతల్లే కడతేర్చమంది !
- ‘మనమైనా చావాలి..నా కొడుకునైనా చంపేయాలి’
- తమ సంబంధం బయటపడుతుందని..తల్లే తన కొడుకుని చంపేయమంది
- ఆటో డ్రైవరే కీలక నిందితుడు
- సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా గుర్తింపు
- చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ‘‘మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం భయడపడకూడదనుకుంటే మనమైనా చావాలి.. లేదా నా కొడుకునైనా చంపేయాలి’’ అంటూ ఓ తల్లి తన స్నేహితుడికి నూరిపోసింది. ఇదే అదునుగా అతను ఆమె కొడుకును కడతేర్చేశాడు. చిన్నారి మురళీధర్ రెడ్డి హత్యకేసును పోలీసు లు ఎట్టకేలకు ఛేదించారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ విషయాలను డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం అలిపిరి పోలీసుస్టేషన్‌లో విలేకరులకు తెలియజేశారు.
వెదురుకుప్పం మండలం కుమ్మరగుంట గ్రామానికి చెందిన మునిరత్నం రెడ్డి తిరుమలలో అటెండర్‌గా పనిచేస్తూ స్థానిక సత్యనారాయణపురంలో కాపురముంటున్నాడు. ఆయనకు భార్య అరుణ, కొడుకు మురళీధర్‌రెడ్డి, కూతురు హేమశ్రీ ఉన్నారు. వీరి ఇంటికి ఎదురుగా వెదురుకుప్పం మండలం దేవళంపేట పంచాయతీ రామకృష్ణాపురానికి చెందిన సీ సోమశేఖరరాజు కుటుంబం నివాసముంటోంది. 17 ఏళ్ల క్రితం తిరుపతికి వచ్చిన సోమశేఖరరాజు ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఆటో కొనుగోలు కోసం మునిరత్నంరెడ్డి ఆయనకు రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. సోమశేఖరరాజు భార్య ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇదే స్కూల్లో మునిరత్నంరెడ్డి పిల్లలు చదువుకుంటున్నారు. మునిరత్నంరెడ్డి పిల్లలను ప్రతిరోజూ సోమశేఖర్‌రాజు తన ఆటోలోనే తీసుకెళ్లి స్కూల్లో వదిలేవాడు. రెండు కుటుంబాల మధ్య ఆరేళ్లుగా సాన్నిహిత్యం పెరిగింది. ఏడాది క్రితమే మునిరత్నంరెడ్డి కారును కొన్నారు.
ఆ కారుకు తరచూ సోమశేఖర్‌రాజు డ్రైవర్‌గా వెళ్లేవాడు. రెండు కుటుంబాల వారు కలిసి గుళ్లుగోపురాలకు వెళ్లేవారు. ఆ సాన్నిహిత్యంతో సోమశేఖర్‌రాజుకు డబ్బు అవసరమైనప్పుడు మునిరత్నం రెడ్డి భార్య అరుణ ఇస్తుండేది. సోమశేఖర్‌రాజు భార్యాపిల్లలు కొన్ని రోజుల క్రితం పీలేరుకు వెళ్లారు. ఇంట్లో సోమశేఖర్‌రాజు ఒక్కడే ఉంటున్నాడు. ప్రతి రోజూ అరుణ ఆయన ఇంటికెళ్లి భోజనం ఇచ్చి వచ్చేది.
గతనెల 28న అరుణ, సోమశేఖర్‌రాజు ఇంట్లో ఉండగా మునిరత్నంరెడ్డి కొడుకు మురళీధర్‌రెడ్డి కిటికీలో నుంచి చూశాడు. 30వ తేదీన అరుణ సోమశేఖర్‌రాజు ఇంటికెళ్లి ఈ విషయం గురించి తన కొడుకు ఇంట్లో చెబితే ఇద్దరికీ ప్రాణాపాయం ఉంటుందని చె ప్పింది. ‘‘మనమిద్దరమైనా చనిపోదాం, లేకుంటే నా కొడుకునైనా చంపేయాలి’’ అంటూ సోమశేఖర్‌రాజుకు చెప్పింది. అరుణ సూచన మేరకు 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇంటి బయట ఆడుకుంటున్న మురళీధర్‌రెడ్డిని ఆటోలో కపిలతీర్థం మార్గంలో జూపార్కు మీదుగా చెర్లోపల్లి పెట్రోల్ బంకు వరకు వెళ్లాడు.
అక్కడ రూ.150కు బాటిల్‌లో పెట్రోల్ పట్టుకుని తొండవాడ క్రాస్, డోర్నకంబాల మీదుగా చవటగుంట వరకు వెళ్లాడు. చీకటి పడ్డాక శానంబట్ల మెటల్ రోడ్డులోని ఓ మామిడి తోపునకు సమీపంలోని ముళ్ల పొదల వద్దకు మురళీధర్‌రెడ్డిని తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని గుర్తు పట్టలేని విధంగా పెట్రోల్ పోసి దహనం చేశాడు. అక్కడి నుంచి అదేరోజు రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు మురళీధర్‌రెడ్డి కోసం సోమశేఖర్‌రాజు అందరితోపాటు వెతుకుతూ ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించాడు.
30వ తేదీ రాత్రి అలిపిరి పోలీసు స్టేషన్‌లో తమ పిల్లాడు తప్పిపోయినట్లు మురళీధర్‌రెడ్డి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 31వ తేదీ ఉదయం డోర్నకంబాల మెటల్ రోడ్డులో ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరిపిన అలిపిరి పోలీసులు సోమశేఖర్‌రాజును అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. మరింత లోతుగా దర్యాప్తు జరిపి చిన్నారి తల్లి అరుణను కూడా అరెస్ట్ చేయనున్నారు.
శభాష్ పోలీసు..
వారం రోజుల్లో చిన్నారి హత్య కేసును ఛేదించి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో విచారణ ఆలస్యం కావడం పరిపాటి. ఈ కేసులో మాత్రం ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, అలిపిరి సీఐ రాజశేఖర్ తమదైన ప్రత్యేకతను కనబరిచి ప్రధాన నిందితుడైన ఆటోడ్రైవర్ సీ.సోమశేఖరరాజును అరెస్ట్ చేశారు.