కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ పార్టీల నేతలు కాకుండా విద్యార్థులే నాయకత్వం వహించేందుకు కళాశాలలు వదిలి బయటికి రావాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్షలు జరిగాయి. విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.
కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటే మూడు ప్రాంతాలు బాగుపడతాయని, విడిపోతే తెలంగాణ మాత్రమే బాగు పడుతుందని చెప్పారు. సీమాంధ్ర విద్యార్థులు ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి పేరున్న ఇంజనీరింగ్ లేదా మెడికల్ కళాశాలల్లో చేరాలంటే అన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని తెలిపారు. కోచింగ్‌సెంటర్లు కూడా అక్కడే ఉన్నాయని చెప్పారు. వృత్తి విద్యకోర్సులు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాలనుకున్నా ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా రాష్ట్ర రాజధానిలోనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అభివృద్ధి రాజధానిలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా జరిగిందన్నారు.
కానీ, మన రాష్ట్రంలో మాత్రమే అభివృద్ధి అంతా హైదరాబాదులో జరిగిందన్నారు. రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ హైదరాబాదునే అభివృద్ధి చేశారంటే అది తెలుగు ప్రజలందరిదీ అన్న భావనే కారణమన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోరుతూ ఫిబ్రవరి 9వ తేది హైదరాబాదులో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజా వేదిక కన్వీనర్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును ఓడించి పంపాల్సిన బాధ్యత సీమాంధ్ర ఎమ్మెల్యేలపై ఉందన్నారు. రాజధాని నగరం అభివృద్ధి చెందడానికి సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణలో నక్సల్స్ సమస్యను నిర్మూలించడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారనే విషయాన్ని తెలంగాణ వాదులు విస్మరించరాదని చెప్పారు.
రాజకీయ జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శాసనసభకు వచ్చిన రాష్ట్ర విభజన బిల్లు చర్చార్హం కాదన్నారు. రాజ్యాంగ బద్దంగా లేని తప్పుల తడక బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపాలన్నారు. బిల్లును తిరస్కరించకపోతే సీమాంధ్ర ప్రజాప్రతినిధులను ప్రజలు తిరస్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవర్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, జేఏసీ నాయకులు సీఆర్‌ఐ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నీలి శ్రీనివాసరావు, , రాజోలి వీరారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ ట్రస్టు అధ్యక్షుడు తోట కృష్ణ, కందుల విద్యా సంస్థల డెరైక్టర్ ప్రొఫెసర్ కేఎస్‌ఎన్ రెడ్డి, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు వెంకట్రామిరెడ్డి, బీఎన్ బాబు, చిన్న సుబ్బయ్య, విద్యుత్ జేఏసీ నాయకులు భద్రయ్య, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం నాయకుడు జోగిరామిరెడ్డి, మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సమైక్య సంఘీభావం
Published Wed, Jan 29 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement