'రైట్ రైట్' అన్నా స్పీడందుకునేలా లేదు..
స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్. మంచి సినిమాలతో మెప్పిస్తున్నా హీరోగా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. అయినా తన ప్రయత్నాల్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. లవర్స్, కేరింత లాంటి సినిమాలతో యూత్కు దగ్గరైన సుమంత్, ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ చేసిన సినిమా 'రైట్ రైట్'. పూర్తి పల్లె వాతావరణంలో తెరకెక్కిన రైట్ రైట్ సుమంత్ అశ్విన్ కెరీర్కు స్పీడు పెంచిందో లేదో చూద్దాం.
తండ్రి మరణంతో పోలీస్ ఆఫీసర్ కావాలన్న తన కలను పక్కన పెట్టి కండక్టర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు ఇ.రవి (సుమంత్ అశ్విన్). కొత్తగా జాయిన్ అయిన వాళ్లకు రోజుకు ఒక్క ట్రిప్ మాత్రమే ఉండే గవిటి రూట్ అయితే బెటర్ అని రవికి అదే రూట్ డ్యూటీ వేస్తారు. వెళ్లే సమయమే కాని తిగిరి ఎప్పుడొస్తుందో చెప్పలేని గవిటి రూట్ బస్ డ్రైవర్ శేషు( కాలకేయ ప్రభాకర్). ఆ ఊరికి వెళ్లేది ఒక్క బస్సే కావటంతో బస్ డ్రైవర్, కండక్టర్లు ఊరి జనాలకు దగ్గరవుతారు. అదే బస్లో రెగ్యులర్గా వచ్చే కళ్యాణి(పూజ జవేరి)తో రవి ప్రేమలో పడతాడు.
అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా రవి, శేషుల బస్ కింద పడి ఓ వ్యక్తి గాయపడతాడు. కేసు అవుతుందన్న భయంతో ఆ వ్యక్తిని ఆ రూట్లో వస్తున్న జీపు డ్రైవర్కి అప్పగించి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తరువాత ఆ బస్ కింద పడిపోయిన వ్యక్తి గవిటి సర్పంచ్ విశ్వానాథ్ గారి అబ్బాయి దేవా అని తెలుస్తుంది. రవి జీపులో ఎక్కించి పంపించిన దేవా ఊరి బయట లోయలో శవమై కనిపిస్తాడు. ఆ నేరం రవి మీద పడుతుంది. అసలు దేవా ఎలా చనిపోయాడు..? ఆ కేసు నుంచి రవి ఎలా బయటపడ్డాడు..? అన్నదే మిగతా కథ.
ఇప్పటి వరకు అల్లరి పాత్రల్లో కనిపించిన సుమంత్ అశ్విన్ తొలిసారిగా ఓ బరువైన పాత్రను ఎంచుకొని విజయం సాధించాడు. డ్రైవర్ శేషుగా ప్రభాకర్ బాగా సెట్ అయ్యాడు. క్యారెక్టర్ పరంగా పెద్దగా స్కోప్ లేకపోయినా హీరోయిన్ పాత్రలో పూజ ఆకట్టుకుంది. పల్లె వాతావరణంలో సాగే లవ్ స్టోరికి చిన్న క్రైం ఎలిమెంట్ యాడ్ చేసి దర్శకుడు మను చేసిన ప్రయత్నం బాగానే ఉన్నా.. కథనం లో మరింత వేగం చూపించాల్సింది. క్రైం థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్ కలిగించే పాయింట్లు పెద్దగా లేకపోవటం పెద్ద మైనస్.
ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరితో కథ నడిపిన దర్శకుడు స్లో నారేషన్తో ఇబ్బంది పెట్టాడు. ఇక సెకండ్ హాఫ్లో క్రైం థ్రిల్లర్గా టర్న్ అయినా కథలో వేగం మాత్రం కనిపించలేదు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద ఆవిష్కరించాడు. జెబి సంగీతం పర్వాలేదు. ఓవరాల్గా ప్రభాకర్తో కలిసి సుమంత్ అశ్విన్ రైట్ రైట్ అన్నా కెరీర్ మాత్రం స్పీడందుకునేలా లేదు.