కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ నేడు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌ను జయించిన ఆయన మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు ఓ లేఖ విడుదల చేశారు. "లుకేమియాతో రెండు సంవత్సరాలపాటు పోరాడిన రిషి కపూర్ నేడు ఉదయం 8.45 గంటలకు కన్నుమూశారు. చివరి క్షణాల్లోనూ వైద్య సిబ్బందితో నవ్వుతూ నవ్విస్తూ గడిపారు. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనూ ఆయన అంతే సరదాగా ఉండేవారు. కుటుంబ సభ్యులతో గడపడం, ఫ్రెండ్స్‌తో ముచ్చటించడం, ఇష్టమైన ఫుడ్ తసుకోవడం.. ఇవన్నీ చూసి ఆయన్ని కలవడానికి వచ్చినవాళ్లందరూ ఆశ్చర్యపోయేవాళ్లు. ప్రపంచం నలుమూలల నుంచీ అభిమానులు కురిపించిన ప్రేమాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మనమందరం ఆయన్ను కన్నీళ్లతో కాకుండా చిరునవ్వుతో గుర్తు చేసుకోవాలని ఆయన చివరి క్షణాల్లో కోరుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కాబట్టి ప్రభుత్వం విధించిన నిబంధనలను అందరూ తప్పక పాటించండ"ని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. (ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత)
రిషి కపూర్ చివరి ట్వీట్..
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిషి కపూర్ ఏప్రిల్ 2న చివరిసారిగా ట్వీట్ చేశారు. ఆఖరి ట్వీట్‌లోనూ అతను ఇతరుల శ్రేయస్సును కోరుకుంటూ తన మంచిమనసును చాటుకున్నారు. కరోనా వైరస్‌తో నిర్విరామంగా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసుల పట్ల హింసను మానుకోవాలని ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. మనకోసం వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని అలాంటి వారిపై దాడులకు దిగడం మానుకోవాలని కోరారు. అయితే గతంలో కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినప్పటికీ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిచేయడంలో ఆయనెప్పుడూ వెనకడుగు వేయకపోవడం గమనార్హం. (క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..)
Comments
Please login to add a commentAdd a comment