సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, చాకొలెట్ బాయ్‌గా పేరొందిన రిషి కపూర్ శాశ్వత నిద్రలోకి జారుకుని అభిమానులను శోకసంద్రంలో ముంచేశారు. కొంతకాలంగా కాన్సర్‌తో పోరాడిన ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరి గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య నీతూ కపూర్, కుమార్తె రిధిమా కపూర్ సాహ్ని, కుమారుడు రణ్‌బీర్ కపూర్ ఉన్నారు. కాగా గత కొంతకాలంగా న్యూయార్క్‌లో చికిత్స పొందిన రిషి కపూర్ కొన్ని నెలల క్రితమే భారత్‌కు తిరిగి వచ్చారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన జర్నీ గురించి పంచుకునేవారు. ఎల్లప్పుడూ సరదాగా ఉండే ఆయన ఇలా అకస్మాత్తుగా కానరానిలోకాలకు తరలివెళ్లడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రిషి కపూర్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. ఇక సినీ కుటుంబం నుంచి బాలీవుడ్ తెరపై అడుగుపెట్టిన రిషి కపూర్ తనదైన నటనతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రిషి కపూర్ సినీ ప్రస్థానంలోని కొన్ని సినిమాల విశేషాలు.(ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత)
బాబీ
రిషి కపూర్ తండ్రి, లెజెండరీ రాజ్ కపూర్ సారథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ఇది. డింపుల్ కపాడియా, రిషి కపూర్ జంటగా నటించారు. 1973లో విడుదలైన ఈ సినిమాతో రిషి కపూర్ రూపంలో హిందీ తెరకు మరో రొమాంటిక్ హీరో దొరికాడు.
ఖేల్ ఖేల్ మే
రవి టాండన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1975లో విడుదలైంది. రిషి కపూర్, నీతూ సింగ్, రాకేశ్ రోషన్ ఈ సినిమాలో కాలేజీ విద్యార్థులుగా నటించారు. భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నవ యుగపు ప్రణయ దృశ్యకావ్యాలను తెరపై ఆవిష్కరించింది. ఇక ఈ సినిమాలో నటించిన నీతూ సింగ్ రిషిని వివాహమాడి నీతూ కపూర్‌గా మారారు.
కర్జ్
1980లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. షౌమన్ సుభాష్ ఘాయ్ సారథ్యంలోనే తెరకెక్కిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కభీ కభీ
బాలీవుడ్ దిగ్గజం యశ్ చోప్రా రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామాలో అమితాబ్ బచ్చన్, రాఖీ, శశి కపూర్, వహీదా రెహమాన్‌లతో రిషి కపూర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 1976లో ఈ సినిమా విడుదలైంది.
లైలా మజ్నూ
హర్నం సింగ్ రావేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1976లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిషి కపూర్, రంజీత, డానీ, అరుణ్ ఇరానీ తదితరులు నటించారు. మదన్ మోహన్, జైదేవ్ సంగీత దర్శకత్వం వహించిన సినిమా ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది.
అమర్ అక్బర్ ఆంటోని
అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 1977లో విడుదలైంది. మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బెస్ట్ యాక్షన్ కామెడీగా నిలిచింది. షబానా అజ్మీ, నీతూ సింగ్, పర్వీన్ బాబీ, ప్రాణ్, జీవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ప్రేమ్ రాగ్
వితంతువును పెళ్లాడలనుకునే ఓ యువకుడి కథ ఇది. రిషి కపూర్, పద్మిణీ కొల్హపురి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా సామాజిక అంశాల గురించి చర్చించింది. రాజ్ కపూర్ ఈ సినిమాకు సారథ్యం వహించారు.
నగీనా
1986లో విడుదలైన ఈ సినిమాలో రిషి కపూర్, శ్రీదేవి జంటగా నటించారు. హర్మేశ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
రిషి కపూర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో హృతిక్ రోషన్, సిద్దార్థ్ మల్హోత్రా యువతరం నటులతో కూడా తెర పంచుకున్నారు. అగ్రిపథ్, కపూర్ అండ్ సన్స్, జూతా కహీ కా వంటి సినిమాల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment