తమిళసినిమా: యువ నటి రీతూవర్మకు ప్రస్తుతం కోలీవుడ్‌లోనే ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. ఈ తెలంగాణ జాణకు పెళ్లిచూపులు చిత్రం పెద్ద విజయాన్నే అందించింది. అంతే కాదు, పలు అవార్డులను తెచ్చిపెట్టింది. తాజాగా అదే పెళ్లిచూపులు చిత్రానికిగాను ఆంధ్ర రాష్ట్రం ఈ బ్యూటీకి నంది అవార్డును కూడా ప్రకటించేసింది. అయితే అక్కడ అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. అదృష్టం ఏమిటంటే కోలీవుడ్‌లో అవకాశాలను రాబట్టుకుంటోంది. ఇప్పటికే గౌతమ్‌మీనన్ దృష్టిలో పడి విక్రమ్‌కు జంటగా ధ్రువనక్షత్రం చిత్రంలో నటిస్తున్న రీతూవర్మ చేతిలో చిన్నా అనే మరో తమిళసినిమా ఉంది. తాజాగా యువ నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్‌సల్మాన్‌తో జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంది.
వాయె మూడి పేసవుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన దుల్కర్‌సల్మాన్ ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో కాదల్ కణ్మణి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలా చాలా సెలెక్టివ్ చిత్రాలనే కోలీవుడ్‌లో చేస్తున్న ఈయన తాజాగా నవ దర్శకుడు దేసింగ్ పెరియస్వామి చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఈ దర్శకుడు గోలీసోడా, పత్తు ఎండ్రదుక్కుళ్ చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేశారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్‌లైయడిత్తాల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఇంజినీర్‌గా నటిస్తున్న దుల్కర్‌సల్మాన్‌కు జంటగా నటి రీతూవర్మను ఎంచుకున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమై చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇది ప్రేమ, యాక్షన్ కలగలిపిన కమర్శియల్ కథా చిత్రంగా ఉంటుందట.
Comments
Please login to add a commentAdd a comment