టైటిల్: కనులు కనులను దోచాయంటే
జానర్: లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతు వర్మ, నిరంజని, రక్షణ్, గౌతమ్ మీనన్
సంగీతం: మాసాల కేఫ్
దర్శకత్వం: దేసింగ్ పెరియసామి
నిర్మాత: ఆంటోనీ జోసెఫ్
నిడివి: 162.10 నిమిషాలు
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నూతన దర్శకుడు దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఓకే బంగారం, మహానటి వంటి సినిమాలతో టాలీవుడ్‌లో అభిమానులను సొంతం చేసుకున్న దుల్కర్ తన 25వ చిత్రానికి పూర్తిగా డిఫరెంట్ కథను ఎంచుకున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆంటోని జోసెఫ్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో దుల్కర్ దక్షిణాదిలో సెటిల్ అయినట్టేనా? ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో మన రివ్యూలో తెలుసుకుందాం
కథ:
ఆరేళ్లుగా సిద్ధార్థ్ (దుల్కర్ సల్మాన్), కల్లీస్ (రక్షణ్) మంచి స్నేహితులు. సిద్ధార్థ్ యాప్ డెవలపర్‌గా, కల్లీస్ యానిమేటర్‌గా పనిచేస్తూ రిచ్ లైఫ్‌ను అనుభవిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరూ మీరా (రీతు వర్మ), శ్రేయా (నిరంజని)లతో తొలి చూపులోనే ప్రేమలో పడతారు. వారి వెంటపడి వారి ప్రేమను పొందుతారు. అయితే మరోవైపు నగరంలో ఆన్‌లైన్ క్రైంతో పాటు ఖరీదైన కార్లలోని ఖరీదైన వస్తువులను దొంగతనాలకు గురవుతాయి. అయితే ఈ కేసులతో పాటు మరో కీలక కేసును అనఫిషియల్‌గా డీల్ చేస్తుంటాడు పోలీస్ కమిషనర్ ప్రతాప్ సింహా (గౌతమ్ మీనన్). మరోవైపు లవ్, పెళ్లి, ఎంజాయ్ అని సిద్దార్థ్, కల్లీస్, మీరా, శ్రేయాలు గోవాకు వెళతారు. అయితే అక్కడ మీరా గురించి సిద్ధార్థ్‌కు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఇంతకి ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? ప్రతాప్ వెతుకుతున్న ఆ మోసగాళ్లు ఎవరు? సిద్ధార్థ్, మీరాల ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? తెలసుకోవాలంటే ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో మెప్పించిన దుల్కర్.. ఈ సినిమాలో సిద్దార్థ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. అయితే అతడి పాత్రను తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఎమోషన్ పండించడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ఇక తెలుగమ్మాయి రీతు వర్మకు ఈ సినిమాలో మంచి క్యారెక్టరే లభించింది. డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించి మెప్పిస్తుంది. రక్షణ్, నిరంజనిల మధ్య వచ్చే కొన్ని సీన్లు నవ్వులు తెప్పిస్తాయి. గౌతమ్ మీనన్ మొదట్లో సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి చివరికి కమెడియన్ అయిపోతాడు. అనీష్ కురువులకు సైతం ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
కథ, కథనం కొత్తగా, డిఫరెంట్‌గా ఉంది. కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. అన్‌లైన్ మోసాలు, దొంగతనాలు, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, పోలీస్ కమిషనర్ ఎంట్రీతో ఇంటర్వెల్ ముందువరకు సాదాసీదాగా సాగిపోతుంది. దీంతో అందరూ రొటీన్ స్టోరీ అనుకుంటారు. కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్ అంచనాలతో పాటు సినిమా మొత్తం టర్న్ అవుతుంది. దీంతో సెకండాఫ్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. అయితే రెండో అర్థభాగాన్ని కూడా దర్శకుడు చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు.
ఫస్టాప్‌లో ఇచ్చిన ట్విస్టులను సెకండాఫ్‌లో ఒక్కొక్కటి రివీల్ చేస్తూనే ఆడియన్స్‌ను కట్టిపడేసేందుకు సస్పెన్స్ సీన్లను జోడించాడు. దీంతో క్రైమాక్స్ వరకు ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురుచూస్తాడు. మధ్యమధ్యలో కామెడీ పండించాలని దర్శకుడు ప్లాన్ చేసినా అంతగా వర్కౌట్ కాదు. కానీ క్రైమ్ సీన్స్ చాలా ఇంట్రెస్ట్‌గా,కొత్తగా ఉంటాయి. ఓ సందర్భంలో ఇంత సులువుగా క్రైమ్ చేసి, విలాసవంతంగా బతకొచ్చా అనే అనుమానం కలుగుతుంది. కానీ రియలస్టిక్‌గా సాధ్యం కాదు. అయితే క్రైమ్ సీన్లు చేయడానికి ఏదో బలమైన కారణం ఉంటుందని సగటు అభిమాని ఆశిస్తే నిరాశ తప్పదు. ఎందుకంటే క్రైమ్ సీన్ల వెనక ఏదో బలమైన కారణం ఉంటే రెగ్యులర్ సినిమా అవుతుందని భావించిన డైరెక్టర్ విభిన్నంగా ఆలోచించి సింపుల్‌గా తెగ్గొట్టేశాడు.
ఇక సాంకేతిక విషయానికి వస్తే పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతమే అక్కడక్కడా విసుగుతెప్పిస్తుంది. లిరిక్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు రిచ్ లుక్‌ను తీసుకొచ్చారు. సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా స్క్రీన్‌ప్లే ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్:
డిఫరెంట్ కాన్సెప్ట్
క్రైమ్ సీన్స్
మైనస్ పాయింట్స్:
స్లో నెరేషన్
నిడివి
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం
-సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment