Dulquer Salmaan Sita Ramam Telugu Movie Review And Rating - Release Live Updates - Sakshi
Sakshi News home page

Sita Ramam Review: ‘సీతారామం’ మూవీ రివ్యూ

Published Fri, Aug 5 2022 12:26 PM | Last Updated on Sat, Aug 6 2022 11:04 AM

Sita Ramam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : సీతారామం
నటీనటులు : దుల్కర్‌ సల్మాన్‌,మృణాల్‌ ఠాగూర్‌, సుమంత్‌, రష్మిక, గౌతమ్‌ మీనన్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు 
నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్
నిర్మాత: అశ్వినీదత్‌
దర్శకత్వం: హను రాఘవపూడి
సంగీతం : విశాల్‌ చంద్రశేఖర్‌
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ - శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్‌:కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది:ఆగస్ట్‌ 05,2022

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమై, తనదైన స్టైల్లో నటిస్తూ తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. ఇంటెన్స్ లుక్స్ , క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ..లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మలయాళ హీరో అయినప్పటికీ తనదైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.

'మహానటి' తర్వాత ఈ రొమాంటిక్‌ హీరో నేరుగా తెలుగులో నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి సీత,రామ్‌ల లవ్‌స్టోరీపై అందరికి ఆసక్తి ఏర్పడింది. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలు మంచి టాక్‌ని సంపాదించుకోవడమే కాకుండా..సినిమాపై అంచనాలు పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడం, అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి హీరోలను భాగం చేయడంతో ‘సీతారామం’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్‌ 5) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? సీత,రామ్‌ల లవ్‌ స్టోరీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.


 

కథేంటంటే..
‘సీతారామం’ కథంతా  1965, 1985 నేప‌థ్యంలో సాగుతుంది. పాకిస్తాన్‌ ఆర్మీ అధికారి(సచిన్‌ ఖేడ్కర్‌) మనవరాలు అఫ్రిన్‌(రష్మిక). లండన్‌లో ఉంటున్న ఆమె తిరిగి వచ్చేసరికి తాతయ్య చనిపోతాడు. ఇంట్లో ఓ ఉత్తరం ఉంటుంది. అది 20 ఏళ్ల క్రితం భారత సైనికుడు లెఫ్టినెంట్‌ రామ్‌(దుల్కర్‌ సల్మాన్‌) రాసిన లెటర్‌. దానిని హైదరాబాద్‌లో ఉంటున్న సీతామహాలక్ష్మికి అందజేయాల్సిన బాధ్యతను అఫ్రిన్‌కి అప్పజెప్పుతాడు. అది తాతయ్య చివరి కోరిక. తాతయ్యపై ప్రేమతో కాకుండా ఆ లెటర్‌ సీతామహాలక్ష్మికి అందిస్తే తప్ప ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదన్న కండీషన్‌ ఉండడంతో అఫ్రిన్‌ ఆ లెటర్‌ని పట్టుకొని హైదరాబాద్‌ వెళ్తోంది. సీత గురించి వెతకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సీతా, రామ్‌ల గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. 

లెఫ్టినెంట్‌ రామ్‌ ఓ అనాథ. దేశం కోసం పనిచేయడం తప్ప..ఆయనకంటూ నా అనేవాళ్లు ఎవరూ లేరు. అలాంటి వ్యక్తికి ఓ రోజు లెటర్‌ వస్తుంది. అది సీతామహాలక్ష్మి రాసిన లేఖ. అడ్రస్‌ లేకుండా వచ్చిన ఆ ఉత్తరాలను చదివి ఆమెతో ప్రేమలో పడిపోతాడు రామ్‌. ఓ రోజు సీతను కలుస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం..ఆపై ప్రేమ పుడుతోంది. ఓ రహస్యాన్ని దాచి రామ్‌ కోసం హైదరాబాద్‌ నుంచి కశ్మీర్‌కి వస్తుంది సీత. ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో ఓ కారణంగా వాళ్లిద్దరు దూరమవుతారు. అసలు సీత దాచిన రహస్యం ఏంటి? సీత ఎవరు? సీత కోసం రామ్‌ రాసిన లేఖ పాకిస్తాన్‌లో ఎందుకు ఆగిపోయింది? ఆ లెటర్‌ని ఆఫ్రిన్‌ సీతకు అందించిందా లేదా? అందులో ఏముంది? అసలు అఫ్రిన్‌కు రామ్‌ ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ‘సీతారామం’ సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
సెన్సిబుల్ లవ్ స్టోరీలకు స్పెషలిస్ట్ హను రాఘవపూడి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా..లవ్‌ స్టోరీని మాత్రం బాగా హ్యాండిల్‌ చేస్తారనే పేరుంది. ఇప్పుడు ‘సీతారామం’తో కూడా అదే మ్యాజిక్‌ని రిపీట్‌ చేశాడు. యుద్దంతో ముడిపడి ఉన్న ఓ బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీని అంతే బ్యూటిఫుల్‌గా తెరకెక్కించాడు. ప్రేమ‌, యుద్ధం అనే రెండు వేర్వేరు నేప‌థ్యాల్ని ఉత్త‌రంతో కలిపి ఓ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీని తెరపై చూపించాడు.

పాకిస్తాన్‌ తీవ్రవాదులు కశ్మీర్‌లో ఎలా విధ్వంసం సృష్టిస్తున్నారు అనే పాయింట్‌తో కథ మొదలవుతుంది. అయితే ఇది ప్రేమ కథా చిత్రమని మేకర్స్‌ మొదటి నుంచి ప్రచారం చేయడంతో ప్రేక్షకుల ఆసక్తి అంతా రామ్‌, సీతల లవ్‌ స్టోరీపైనే ఉంటుంది. ఎప్పుడైతే రామ్‌కి సీత ఉత్తరాలు రాయడం మొదలు పెడుతుందో అ‍ప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. 

సీత కోసం రామ్‌ హైదరాబాద్‌ వెళ్లడం.. అక్కడ వాళ్ల జర్నీ..తనకు ఉత్తరాలు రాసిన ప్రతి ఒక్కరిని రామ్‌ కలుస్తుండడం.. ఇలా తెలియకుండానే ఫస్టాఫ్‌ ముగుస్తుంది. మధ్య మధ్యలో వెన్నెల కిశోర్‌, సునీల్‌ కామెడీ పండించే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్‌ కాలేదు. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అయితే అదిరిపోతుంది. సెకండాఫ్‌లో సీత, రామ్‌లా లవ్‌స్టోరీ ఎలా సాగుతుందనేదానిపై ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలుగుతుంది. అంతే ఆసక్తిగా సెకండాఫ్‌ సాగుతుంది. లవ్‌స్టోరీని క్యారీ చేస్తూనే మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ని యాడ్‌ చేస్తూ సెకండాఫ్‌ని నడిపించాడు. 

రామ్‌ తనకు లేఖలు రాసిన ఓ చెల్లి దగ్గరకు వెళ్లడం..ఆమె ఉన్న పరిస్థితిని చూసి ఆ బాధ్యతను తనపై వేసుకోవడం హృదయాలను హత్తుకుంటుంది. ఇక ఆర్మి అధికారి విష్ణుశర్మ(సుమంత్‌)లోని రెండో కోణం కూడా ఇంట్రెస్టింగ్‌ చూపించాడు. సినిమా ప్రారంభంలో కశ్మీర్‌ అల్లర్లకు, యుద్దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో అనేదానికి సెకండాఫ్‌లో మంచి వివరణ ఇచ్చాడు. అలాగే అఫ్రిన్‌ పాత్ర ఇచ్చిన ముగింపు కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని ప్రతి పాత్రని ఫర్‌ఫెక్ట్‌గా వాడుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌ కొంత స్లోగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం  ఎమోషనల్‌గా నడిపించి సరికొత్త ప్రేమ కథను చూపించాడు. ఎలాంటి అశ్లీలత లేకుండా ఓ స్వచ్ఛమైన ప్రేమకథ చిత్రం ఇది. 


ఎవరెలా చేశారంటే. 
లెఫ్ట్‌నెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ ఒదిగిపోయాడు. తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన మాటతీరు, యాకి​ంగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రకు దుల్కర్‌ ఫర్‌ఫెక్ట్‌ చాయిస్‌ అనేలా నటించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. ఇక సీత పాత్రకు మృణాల్‌ న్యాయం చేసింది. తెరపై బ్యూటిఫుల్‌గా కనిపించింది. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా చక్కగా నటించింది. మత పిచ్చి, పొగరు ఉన్న అమ్మాయి అఫ్రిన్‌గా రష్మిక అదరగొట్టేసింది.

క్లైమాక్స్‌లో ఆమె పాత్రకు ఇచ్చిన ముగింపు సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో బాగా పండిన పాత్రల్లో సుమత్‌ది ఒకటి. ఆర్మీ అధికారి విష్ణుశర్మగా సుమంత్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర తొలి నుంచి అనుమానంగానే చూపిస్తూ.. ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచారు. ఆయన భార్యగా భూమిక కనిపిస్తుంది. కానీ ఆమె పాత్రలో అంతగా స్కోప్‌ లేదు. ఇక గోపాల్‌గా తరుణ్‌ భాస్కర్‌తో పాటు ఆర్మీ చీఫ్‌లుగా ప్రకాశ్‌ రాజ్‌, గౌతమ్‌ మీనన్‌ తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం విశాల్ చంద్రశేఖర్ సంగీతం. అద్భుతమైన పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో విజువల్స్ స్థాయిని పెంచడమే కాదు.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై అందంగా చూపించాడు. కశ్మీర్‌ అందాలను అద్భుతంగా చూపించాడు. అద్భుతమైన విజువల్స్‌ని అందించి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ పర్వాలేదు. వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement