టైటిల్: ఒకే ఒక జీవితం
నటీనటులు: శర్వానంద్, రీతూవర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు
నిర్మాతలు : ఎస్‌ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
సంగీతం : జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022
కథేంటంటే..
ఆది(శర్వానంద్), శ్రీను(వెన్నెల కిశోర్), చైతూ(ప్రియదర్శి) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆది మంచి గిటారిస్ట్ కానీ స్టేజ్‌పై పాడాలంటే భయం. ప్రియురాలు వైష్ణవి(రీతూ వర్మ) ఎంత ఎంకరేజ్ చేసినా.. ఆది సక్సెస్ కాలేకపోతాడు. కళ్ల ముందు అమ్మ (అమల) ఉంటే బాగుండేది అనుకుంటారు. ఇరవేళ్ల క్రితం(మార్చి 28,1998) రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి ఆదికి స్టేజ్ ఫిగర్ ఇంకా ఎక్కువతుంది.
ఇక శ్రీను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేక హౌస్ బ్రోకర్‌గా మారుతాడు. ఇంగ్లీష్ అస్సలు రాదు. చిన్నప్పుడు మంచిగా చదువుకొని ఉంటే బాగుండేది కదా అని బాధ పడుతుంటాడు. ఇక మూడో వ్యక్తి చైతూకి పెళ్లి సమస్య. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలకుంటాడు. కానీ ఏ అమ్మాయి నచ్చదు. చిన్నప్పుడు తనను ఇష్టపడిన సీతను ఎందుకు ప్రేమించలేదని ప్రతి క్షణం బాధపడుతుంటాడు.
ఇలా బాధపడుతున్న ఈ ముగ్గురు స్నేహితుల జీవితంలోకి సైంటిస్ట్ రంగీ కుట్టా పాల్ అలియాస్ పాల్ (నాజర్) ప్రవేశిస్తాడు. అతను టైమ్ మిషన్ కనిపెట్టడానికి 20 ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉంటాడు. చివరకు తను టైమ్ మిషన్‌ని కనిపెడతాడు. ఆ మిషన్‌తో ఆది,శ్రీను, చైతూలను భూత కాలంలోకి పంపుతానని చెబుతాడు. వారు కూడా తాము చేసిన తప్పులను సవరించుకోవాలని భావించి గత కాలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతారు. మరి ఆది వెనక్కి వెళ్లి రోడ్డు ప్రమాదం బారిన పడకుండా తన తల్లిని కాపాడుకున్నాడా? శ్రీను, చైతూలు పాత తప్పుల్ని సరిదిద్దుకున్నారా? లేదా? భూతకాలంలో ఈ ముగ్గురికి ఎదురైన వింత సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ
ఎవరెలా చేశారంటే..
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ఆదిత్య 369. ఆ మధ్య వచ్చిన ‘24’తో పాటు రీసెంట్‌గా విడుదలైన ‘బింబిసార’కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాలే. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘ఒకే ఒక జీవితం’. అయితే ఆ సినిమాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది టైమ్ ట్రావెల్ చిత్రమే అయినప్పటికీ..ఇందులో ‘అమ్మ’ కథ దాగి ఉంది.
20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.
టైమ్ మిషన్‌లోకి వెళ్లేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది..కానీ ఒక్కసారి భవిష్యత్తులోకి వెళ్లాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముగ్గురు యువకులు.. చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకునేందుకు వెళ్లడం..తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం..ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శర్వానంద్, అమల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎమోషనల్గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది.
వెన్నెల కిశోర్ పాత్ర సినిమాకు మరో ప్రధాన బలం. ఆ పాత్ర పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ప్రియదర్శి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చి దిద్దితే బాగుండేది. భూతకాలంలోకి వెళ్లిన శ్రీను, చైతూలను కూడా తమ ఫ్యామిలీలతో కలిసేలా చూపిస్తే.. కథ ఇంకాస్త ఎమోషనల్‌గా సాగేదేమో. క్లైమాక్స్ కూడా ఊహకి అందేలా ఉంటుంది. టైమ్ ట్రావెల్ సీన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. స్లో నెరేషన్ కూడా సినిమాకు కాస్త మైనస్. సైన్స్ గొప్పదని చెప్తూనే.. విధిని ఎవరు మార్చలేరనే విషయాన్ని బలంగా చూపించిన దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
శర్వానంద్‌ని నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఆది పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. రొటీన్ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నమైన పాత్ర తనది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం వెన్నెల కిశోర్ పాత్ర. బ్రోకర్ శ్రీనుగా వెన్నెల కిశోర్ తనదైన కామెడీతో నవ్వించాడు. అదే సమయంలో కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగ్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. చైతూ పాత్రకి ప్రియదర్శి న్యాయం చేశాడు. తన పాత్రని ఇంకాస్త బలంగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇక ఈ సినిమాకు అమల పాత్ర మరో ప్లస్ పాయింట్. అమ్మ పాత్రకు చాలా బాగా సూట్ అయ్యారు. శర్వానంద్, అమల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఇక ఆది లవర్ వైష్ణవిగా రీతూ వర్మ మెప్పించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. సైంటిస్ట్ పాల్‌గా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇలాంటి సీరియస్ పాత్రలు చేయడం నాజర్‌కి కొత్తేమి కాదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ చిత్రంలో హీరో గిటారిస్ట్. కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా గుర్తిండిపోయే పాటలు లేకపోవడం మైనస్. ‘అమ్మ’పాట మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. కానీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆ పాటని మర్చిపోతాం. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్‌ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment