Vennala Kishore
-
ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు: అనన్య
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ లో భ్రమరాంబ పాత్రలో నటించాడు. కథలో నా రోల్ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్రలో నటించలేదు. ఇది చాలా డిఫరెంట్ మూవీ’ అంటున్నారు యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అనన్య తాజాగా మీడియాతో ముచ్చటించారు.⇢ ఇప్పటివరకూ ఇలాంటి కథ నేను వినలేదు. మోహన్ గారు కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. ఒక సంఘటన జరిగినపుడు అందులో ఒకొక్కరి కోణం నుంచి ఒకొక్క పెర్స్ఫెక్టివ్ ఉంటుంది. ఇలా కథని తీసుకెళ్లడం నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. కథ వినగానే ఓకే చెప్పాను. వందశాతం ఆడియన్స్ కి ఈ సినిమా మంచి క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది.⇢ ఇందులో డిటెక్టివ్ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్ అని పెట్టడం జరిగింది. తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా ఆ ట్యాగ్ ని పెట్టడం జరిగింది.⇢ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. అదే రోజు ఓ కేసు జరిగింది. ఆ కేసు తీగలాగితే డొంక కదిలినట్లుగా చాలా మలుపులతో కథనం ఎంగేజింగ్ గా ఉంటుంది. ⇢ తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాను. నా సీనీ జర్నీ పట్ల హ్యాపీగా ఉన్నాను. నాకు కంటిన్యూ గా వర్క్ వస్తోంది. రీసెంట్ గా పోట్టేల్ సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత నా దగ్గరకి మంచి కథలు వచ్చాయి. ఓ రెండు సినిమాలు సైన్ చేశాను.⇢ ప్రస్తుతం తెలుగులో కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. -
Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ
టైటిల్: హను-మాన్ నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి దర్శకత్వం: ప్రశాంత్ వర్మ సంగీతం: గౌరహరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి విడుదల తేది: జనవరి 12, 2024 ఈ సంక్రాంతి బరిలో మూడు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. వాటికి పోటీగా అన్నట్లు ‘హను-మాన్’ దిగాడు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రచార చిత్రాలు విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘హను-మాన్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టూ తిరుగుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆ ఊర్లో అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజ సజ్జ)తో కలిసి నివాసం ఉంటుంది. హనుమంతు ఓ చిల్లర దొంగ.ఊర్లో చిన్న చిన్న వస్తువులను దొంగలిస్తూ చిల్లరగా తిరుగుతుంటారు. ఆ ఊరి బడి పంతులు మనవరాలు మీనాక్షి(అమృత అయ్యర్) అంటే హనుమంతుకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓ రోజు బందిపోట్లు మీనాక్షిపై దాడి చేసేందుకు యత్నించగా.. హనుమంతు ఆమెను రక్షించబోయి జలపాతంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుడి రక్త ధారతో ఏర్పడి రుధిర మణి హనుమంతుని చేతికి చిక్కుతుంది. అప్పటి నుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదిలా ఉంటే.. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ రాయ్)..ఆ శక్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తాడు. ప్రపంచంలో తనకు మాత్రమే సూపర్ పవర్స్ ఉండాలని, ఆ దిశగా ప్రయోగాలు సైతం చేయిస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి తెలుస్తుంది. దీంతో మైఖేల్ తన అనుచరులతో అంజనాద్రి గ్రామానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుకి ఉన్న శక్తులను సొంతం చేసుకునేందుకు మైఖేల్ పన్నిన పన్నాగం ఏంటి? అసలు ఆ శక్తులు హనుమంతుకు మాత్రమే ఎందుకు వచ్చాయి? హనుమంతుకి ఆపద వచ్చినప్పుడలా రక్షిస్తున్న స్వామిజీ(సముద్రఖని) ఎవరు? ఎందుకు రక్షిస్తున్నాడు? హనుమంతుకి ఉన్న శక్తులు ఉదయం పూట మాత్రమే ఎందుకు పని చేస్తాయి? అంజనాద్రిని కాపాడుకోవడం కోసం హనుమంతు ఏం చేశాడు? అసలు మీనాక్షి-హనుమంతుల ప్రేమ సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరోకి సూపర్ పవర్స్ రావడం.. ఆ శక్తిని మంచి కోసం ఉపయోగించడం.. విలన్ దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించడం.. హీరో అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ఆ శక్తిని లోక కల్యాణం కోసం వాడడం.. ఈ తరహా కాన్సెప్ట్‌తో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ లాంటి సూపర్ హీరోలు అందరికి పరిచయమే. అయితే ఈ కథలన్నింటికి మూలం మన పురాణాలే. మన ఇండియాకు ఆంజనేయ స్వామిజీనే ఓ సూపర్ మ్యాన్ అని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది లేదు. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులోనూ సినిమాలు వచ్చాయి కానీ.. నేటివిటీ కామెడీని టచ్ చేస్తూ.. తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీని చివరి వరకు కంటిన్యూ చేశాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కథను తీర్చి దిద్దాడు. కేవలం సూపర్ పవర్స్ కాన్సెప్ట్నే కాకుండా సిస్టర్ సెంటిమెంట్, ప్రేమ కథను కూడా ఇందులో జోడించాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. అలా అని అనవసరంగా జోడించినట్లు కూడా లేవు. కథ రొటీన్‌గా సాగుతుందనే ఫీలింగ్ కలిగేలోపు ఆంజనేయ స్వామి తాలుకు కథను తీసుకురావడం..గూస్బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టడంతో చూస్తుండగానే సినిమా అయిందనే భావన కలుగుతుంది. హను-మాన్ కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. విలన్ ఎందుకు సూపర్ పవర్స్ కావాలనుకునేది ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించాడు. ఆ తర్వాత కథంతా అంజనాద్రి చుట్టూ తిరుగుతుంది. కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం..హీరో గురించి ఆ కోతి చెప్పే మాటలు నవ్వులు పూయిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. హీరోకి ఎప్పుడైన సూపర్ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి కథనం ఆసక్తిరంగా సాగుతుంది. రాకేష్ మాస్టర్ గ్యాంగ్‌తో హీరో చేసే ఫైట్ సీన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సత్య, గెటప్ శ్రీను కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కథ సింపుల్‌గా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలోనే అసలు కథంతా ఉంటుంది. సూపర్ పవర్స్ కోసం విలన్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయి. హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా విజుల్స్ వేయిస్తాయి. ఓ సందర్భంలో పెద్ద బండరాయిని కూడా ఎత్తేస్తాడు. అయినా కూడా అది అతిగా అనిపించడు. మరో యాక్షన్ సీన్లో చెట్టు వేర్లతో హెలికాప్టర్ని ఆపేస్తాడు..అయినా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. విఎఫెక్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంత తక్కువ బడ్జెట్(రూ. 25 కోట్లు అని సమాచారం)లో ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మను నిజంగా అభినందించాల్సిందే. రాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి ? అనే ఆసక్తికర ప్రశ్నతో సీక్వెల్‌ని ప్రకటించాడు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీ ఏంటి అనేది 2025లొ విడుదలయ్యే ‘జై హను-మాన్’లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. తేజ సజ్జకు నటన కొత్తేమి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన నటనతో మెప్పించాడు. హీరోగాను మంచి మార్కులే సాధించాడు. ఇక హనుమాన్ కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది. కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. కామెడీ, ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్‌ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా.. సూపర్ పవర్స్ ఉన్న హను-మాన్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరో సోదరి అంజనమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా ఇందులో ఓ యాక్షన్స్ సీన్ ఉంది. అమృత అయ్యర్ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్‌ని తెరపై చూడాల్సిందే. వినయ్ రాయ్ స్టైలీష్ విలన్‌గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో గౌరహరి సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా తెరకెక్కించాడు. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ
టైటిల్: ఒకే ఒక జీవితం నటీనటులు: శర్వానంద్, రీతూవర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నిర్మాతలు : ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు డైలాగ్స్: తరుణ్ భాస్కర్ సంగీతం : జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022 కథేంటంటే.. ఆది(శర్వానంద్), శ్రీను(వెన్నెల కిశోర్), చైతూ(ప్రియదర్శి) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆది మంచి గిటారిస్ట్ కానీ స్టేజ్‌పై పాడాలంటే భయం. ప్రియురాలు వైష్ణవి(రీతూ వర్మ) ఎంత ఎంకరేజ్ చేసినా.. ఆది సక్సెస్ కాలేకపోతాడు. కళ్ల ముందు అమ్మ (అమల) ఉంటే బాగుండేది అనుకుంటారు. ఇరవేళ్ల క్రితం(మార్చి 28,1998) రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి ఆదికి స్టేజ్ ఫిగర్ ఇంకా ఎక్కువతుంది. ఇక శ్రీను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేక హౌస్ బ్రోకర్‌గా మారుతాడు. ఇంగ్లీష్ అస్సలు రాదు. చిన్నప్పుడు మంచిగా చదువుకొని ఉంటే బాగుండేది కదా అని బాధ పడుతుంటాడు. ఇక మూడో వ్యక్తి చైతూకి పెళ్లి సమస్య. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలకుంటాడు. కానీ ఏ అమ్మాయి నచ్చదు. చిన్నప్పుడు తనను ఇష్టపడిన సీతను ఎందుకు ప్రేమించలేదని ప్రతి క్షణం బాధపడుతుంటాడు. ఇలా బాధపడుతున్న ఈ ముగ్గురు స్నేహితుల జీవితంలోకి సైంటిస్ట్ రంగీ కుట్టా పాల్ అలియాస్ పాల్ (నాజర్) ప్రవేశిస్తాడు. అతను టైమ్ మిషన్ కనిపెట్టడానికి 20 ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉంటాడు. చివరకు తను టైమ్ మిషన్‌ని కనిపెడతాడు. ఆ మిషన్‌తో ఆది,శ్రీను, చైతూలను భూత కాలంలోకి పంపుతానని చెబుతాడు. వారు కూడా తాము చేసిన తప్పులను సవరించుకోవాలని భావించి గత కాలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతారు. మరి ఆది వెనక్కి వెళ్లి రోడ్డు ప్రమాదం బారిన పడకుండా తన తల్లిని కాపాడుకున్నాడా? శ్రీను, చైతూలు పాత తప్పుల్ని సరిదిద్దుకున్నారా? లేదా? భూతకాలంలో ఈ ముగ్గురికి ఎదురైన వింత సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ఆదిత్య 369. ఆ మధ్య వచ్చిన ‘24’తో పాటు రీసెంట్గా విడుదలైన ‘బింబిసార’కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాలే. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘ఒకే ఒక జీవితం’. అయితే ఆ సినిమాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది టైమ్ ట్రావెల్ చిత్రమే అయినప్పటికీ..ఇందులో ‘అమ్మ’ కథ దాగి ఉంది. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు. టైమ్ మిషన్‌లోకి వెళ్లేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది..కానీ ఒక్కసారి భవిష్యత్తులోకి వెళ్లాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముగ్గురు యువకులు.. చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకునేందుకు వెళ్లడం..తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం..ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శర్వానంద్, అమల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. వెన్నెల కిశోర్ పాత్ర సినిమాకు మరో ప్రధాన బలం. ఆ పాత్ర పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ప్రియదర్శి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చి దిద్దితే బాగుండేది. భూతకాలంలోకి వెళ్లిన శ్రీను, చైతూలను కూడా తమ ఫ్యామిలీలతో కలిసేలా చూపిస్తే.. కథ ఇంకాస్త ఎమోషనల్‌గా సాగేదేమో. క్లైమాక్స్ కూడా ఊహకి అందేలా ఉంటుంది. టైమ్ ట్రావెల్ సీన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. స్లో నెరేషన్ కూడా సినిమాకు కాస్త మైనస్. సైన్స్ గొప్పదని చెప్తూనే.. విధిని ఎవరు మార్చలేరనే విషయాన్ని బలంగా చూపించిన దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. శర్వానంద్‌ని నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఆది పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. రొటీన్ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నమైన పాత్ర తనది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం వెన్నెల కిశోర్ పాత్ర. బ్రోకర్ శ్రీనుగా వెన్నెల కిశోర్ తనదైన కామెడీతో నవ్వించాడు. అదే సమయంలో కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగ్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. చైతూ పాత్రకి ప్రియదర్శి న్యాయం చేశాడు. తన పాత్రని ఇంకాస్త బలంగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇక ఈ సినిమాకు అమల పాత్ర మరో ప్లస్ పాయింట్. అమ్మ పాత్రకు చాలా బాగా సూట్ అయ్యారు. శర్వానంద్, అమల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఇక ఆది లవర్ వైష్ణవిగా రీతూ వర్మ మెప్పించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. సైంటిస్ట్ పాల్గా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇలాంటి సీరియస్ పాత్రలు చేయడం నాజర్‌కి కొత్తేమి కాదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ చిత్రంలో హీరో గిటారిస్ట్. కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా గుర్తిండిపోయే పాటలు లేకపోవడం మైనస్. ‘అమ్మ’పాట మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. కానీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆ పాటని మర్చిపోతాం. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లేలా ‘రాజమండ్రి రోజ్ మిల్క్’
జై జాస్తి, అనంతిక జంటగా వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రణీత పట్నాయక్ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘రాజమండ్రి రోజ్ మిల్క్’. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో డి. సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. దర్శకుడు నాని మాట్లాడుతూ – ‘‘కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపు రాని సంఘటనలను గుర్తు చేస్తుంది’’ అన్నారు. ‘‘జూన్ 10న రెండవ షెడ్యూల్‌ను రాజమ్రండిలో ఆరంభిస్తాం. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్–సౌరభ్, కెమెరా: ముఖేష్ .జి, శక్తి అరవింద్. -
వెన్నెల కిషోర్ బర్త్‌డే స్పెషల్: ‘కాకా నువ్వు కేక!
సాక్షి, హైదరాబాద్: తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి దొరికిన గొప్పవరం. టైమ్లీ పంచ్ డైలాగులు, అల్టిమేట్ కామెడీతో ఆయన తెరపై కనపించగానే వెన్నెల విరబూసినంత హాయి. థియేటర్లో అలా కనపడగానే సీటీలు మారుమోగుతాయి. ఎన్నారై సాఫ్ట్వేర్ టర్న్డ్ యాక్టర్ , కామారెడ్డి కుర్రోడు బొక్కల కిషోర్ కుమార్ అదే పర్ఫెక్ట్ కామెడీ కింగ్ మన వెన్నెల కిషోర్‌కు హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. కామ్ -
‘మళ్ళీ మొదలైంది’: మోటివేషనల్ స్పీకర్‌గా వెన్నెల కిషోర్
సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రెడ్ సినిమాస్ బ్యానర్‌పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతొంది. ఈ చిత్రంలో ఇన్స్పిరేషనల్ సింగిల్ మదర్ పాత్రలో నటిస్తోన్న సుహాసిన లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమాలో మరో కీలక పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది. ఆ కీలక పాత్ర చేసిందెవరో కాదు.. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్. తక్కువగా మోటివేట్ చేస్తూ, ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే ఫ్రెండ్ పాత్రలో వెన్నెల కిషోర్ అలరించబోతున్నాడు. రీసెంట్గా ..కుటుంబం, సభ్యుల మధ్య ఉండే లవ్ అండ్ ఎమోషన్స్‌తో పాటు భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందని తెలిసేలా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. -
మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన 'తోలుబొమ్మలాట' చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. బలమైన, పదునైన డైలాగులతో, మానవ సంబంధాల మర్మాన్ని విప్పుతున్నట్టున్న ఈ మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆ నలుగురు లాంటి మూవీల ద్వారా విలక్షణ పాత్రల్లో నటుడిగా తనకంటూ ఒకప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్ననటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ సోమరాజు అలియాస్ సోడాల్రాజు పాత్ర ద్వారా మరోసారి ప్రశంసలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి విలువలతో విభిన్న కుటుంబ కథాచిత్రంగా వస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదైలన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా విశ్వనాథ్ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పక్కా గ్రామీణ వాతావరణం, గ్రామీణ కళలతోపాటు, కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా మూవీ థియేటర్లను పలకరించే సమయం చాలా సమీపంలోనే ఉంది. Motion poster from Team #Tholubommalata 😀😀😀https://t.co/EbdutRmGdh — vennela kishore (@vennelakishore) October 11, 2019 -
ఇంగ్లాండ్ అలా గెలిచిందట.!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య, ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూత లూగించింది. న్యూజిలాండ్‌కు గెలుపు ఖాయమనుకుంటున్న దశలో 49వ ఓవర్ మొత్తం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా ఓవర్ త్రో ఇంగ్లాండ్ జట్టుకు అనూహ్యంగా పరుగులు తోడవడం కీలక పరిణామం. చివరికి టై అవ్వడం, సూపర్ ఓవర్, రెండోసారి కూడా టై అయినా కూడా ఇంగ్లాండ్ విజేతగా నిలవడం తెలిసిన సంగతే. ప్రపంచ కప్ వీక్షిస్తున్న కోట్లాది ప్రేక్షకులు ఇంకా అమోమయం తేరుకోకముందే ఐసీసీ అందరికీ షాక్ ఇచ్చింది. ఏం జరుగుతోందో అర్ధమయ్యలోపే ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించింది. క్రికెట్ చరిత్రలో ఇదో కొత్త చరిత్రగా విశ్లేషకులు భావిస్తుండగా, సోషల్ మీడియాలో పలు సందేహాలు, న్యూజిలాండ్‌పై తీవ్ర సానుభూతి వ్యక్తమైంది. నైతికంగా న్యూజిలాండ్‌దే గెలుపు అని కొందరు వ్యాఖ్యానిస్తే.. ఏ రన్ అవుట్‌తో అయితే ధోనిని పెవిలియన్‌కు పంపారో.. న్యూజిలాండ్ కూడా అదే రనౌట్‌తో రన్నరప్‌గా నిలిచిందని మరికొందరు కమెంట్ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు వెన్నెల కిషోర్ షేర్ చేసిన వీడియో వైరలవుతోంది. రెండుసార్లు టై అయిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజేత ఎలా అయిందో తెలుపుతూ వెన్నెల కిశోర్, బాలాజీ కలిపి ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. నితిన్ హీరోగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో పరిమళగా నటిస్తున్న వెన్నెల కిషోర్ షూటింగ్ బ్రేక్‌లో ఈ వీడియోను తీసినట్టు ట్వీట్ చేశారు. In the mean time #Bheeshma Night shoot on hold for a moment.. pic.twitter.com/hrhvhRf6PP — vennela kishore (@vennelakishore) July 14, 2019 కాగా ఆదివారం జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసి అల్ ఔట్ అయింది. అయినా కూడా ఆఖరి బంతికి ఒక పరుగు రావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్ణయం తీసుకోగా ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేత అంటూ ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుని విజేతగా ప్రకటిస్తారు. అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ జట్టు రెండు బౌండరీలు కొట్టింది. కానీ, న్యూజిలాండ్ కేవలం ఒక సిక్స్ (సూపర్ ఓవర్)మాత్రమే కొట్టింది. దీంతో బౌండరీల లెక్కన ఇంగ్లండ్ గెలిచినట్టు ప్రకటించారు. చదవండి :ప్రపంచ కల నెరవేరింది -
బాబోయ్... ఎలుక!
కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డైరక్టర్ రేలంగి నరసింహారావు, కొంత విరామం తర్వాత తీసిన చిత్రం ‘ఎలుకా మజాకా’. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘వెన్నెల’ కిషోర్, పావని జంటగా నా ఫ్రెండ్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ -‘‘ఎలుక ప్రధానంగా ఇంతవరకూ హాలీవుడ్‌లోనే వచ్చాయి. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. నేను కామెడీ చిత్రాలు మాత్రమే చేశాను. కానీ సీజీ వర్క్ నేపథ్యంలో సాగే హాస్యరస చిత్రం చేయడం ఇదే ఫస్ట్ టైమ్. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అని తెలిపారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, మాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్, గ్రాఫిక్స్: సత్య.