టైటిల్: హను-మాన్
నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు
నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
సంగీతం: గౌరహరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: శివేంద్ర
ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి
విడుదల తేది: జనవరి 12, 2024
ఈ సంక్రాంతి బరిలో మూడు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. వాటికి పోటీగా అన్నట్లు ‘హను-మాన్’ దిగాడు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రచార చిత్రాలు విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘హను-మాన్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టూ తిరుగుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆ ఊర్లో అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజ సజ్జ)తో కలిసి నివాసం ఉంటుంది. హనుమంతు ఓ చిల్లర దొంగ.ఊర్లో చిన్న చిన్న వస్తువులను దొంగలిస్తూ చిల్లరగా తిరుగుతుంటారు. ఆ ఊరి బడి పంతులు మనవరాలు మీనాక్షి(అమృత అయ్యర్) అంటే హనుమంతుకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓ రోజు బందిపోట్లు మీనాక్షిపై దాడి చేసేందుకు యత్నించగా.. హనుమంతు ఆమెను రక్షించబోయి జలపాతంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుడి రక్త ధారతో ఏర్పడి రుధిర మణి హనుమంతుని చేతికి చిక్కుతుంది. అప్పటి నుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి.
ఇదిలా ఉంటే.. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ రాయ్)..ఆ శక్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తాడు. ప్రపంచంలో తనకు మాత్రమే సూపర్ పవర్స్ ఉండాలని, ఆ దిశగా ప్రయోగాలు సైతం చేయిస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి తెలుస్తుంది. దీంతో మైఖేల్ తన అనుచరులతో అంజనాద్రి గ్రామానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుకి ఉన్న శక్తులను సొంతం చేసుకునేందుకు మైఖేల్ పన్నిన పన్నాగం ఏంటి? అసలు ఆ శక్తులు హనుమంతుకు మాత్రమే ఎందుకు వచ్చాయి? హనుమంతుకి ఆపద వచ్చినప్పుడలా రక్షిస్తున్న స్వామిజీ(సముద్రఖని) ఎవరు? ఎందుకు రక్షిస్తున్నాడు? హనుమంతుకి ఉన్న శక్తులు ఉదయం పూట మాత్రమే ఎందుకు పని చేస్తాయి? అంజనాద్రిని కాపాడుకోవడం కోసం హనుమంతు ఏం చేశాడు? అసలు మీనాక్షి-హనుమంతుల ప్రేమ సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
హీరోకి సూపర్ పవర్స్ రావడం.. ఆ శక్తిని మంచి కోసం ఉపయోగించడం.. విలన్ దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించడం.. హీరో అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ఆ శక్తిని లోక కల్యాణం కోసం వాడడం.. ఈ తరహా కాన్సెప్ట్‌తో హాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ లాంటి సూపర్ హీరోలు అందరికి పరిచయమే. అయితే ఈ కథలన్నింటికి మూలం మన పురాణాలే. మన ఇండియాకు ఆంజనేయ స్వామిజీనే ఓ సూపర్ మ్యాన్ అని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ.
కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది లేదు. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులోనూ సినిమాలు వచ్చాయి కానీ.. నేటివిటీ కామెడీని టచ్ చేస్తూ.. తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీని చివరి వరకు కంటిన్యూ చేశాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కథను తీర్చి దిద్దాడు. కేవలం సూపర్ పవర్స్ కాన్సెప్ట్‌నే కాకుండా సిస్టర్ సెంటిమెంట్, ప్రేమ కథను కూడా ఇందులో జోడించాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. అలా అని అనవసరంగా జోడించినట్లు కూడా లేవు. కథ రొటీన్‌గా సాగుతుందనే ఫీలింగ్ కలిగేలోపు ఆంజనేయ స్వామి తాలుకు కథను తీసుకురావడం..గూస్‌బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టడంతో చూస్తుండగానే సినిమా అయిందనే భావన కలుగుతుంది.
హను-మాన్ కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. విలన్ ఎందుకు సూపర్ పవర్స్ కావాలనుకునేది ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించాడు. ఆ తర్వాత కథంతా అంజనాద్రి చుట్టూ తిరుగుతుంది. కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం..హీరో గురించి ఆ కోతి చెప్పే మాటలు నవ్వులు పూయిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. హీరోకి ఎప్పుడైన సూపర్ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి కథనం ఆసక్తిరంగా సాగుతుంది. రాకేష్ మాస్టర్ గ్యాంగ్‌తో హీరో చేసే ఫైట్ సీన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సత్య, గెటప్ శ్రీను కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కథ సింపుల్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
ఇక ద్వితియార్థంలోనే అసలు కథంతా ఉంటుంది. సూపర్ పవర్స్ కోసం విలన్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయి. హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా విజుల్స్ వేయిస్తాయి. ఓ సందర్భంలో పెద్ద బండరాయిని కూడా ఎత్తేస్తాడు. అయినా కూడా అది అతిగా అనిపించడు. మరో యాక్షన్ సీన్‌లో చెట్టు వేర్లతో హెలికాప్టర్‌ని ఆపేస్తాడు..అయినా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. విఎఫెక్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంత తక్కువ బడ్జెట్(రూ. 25 కోట్లు అని సమాచారం)లో ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మను నిజంగా అభినందించాల్సిందే. రాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి ? అనే ఆసక్తికర ప్రశ్నతో సీక్వెల్‌ని ప్రకటించాడు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీ ఏంటి అనేది 2025లొ విడుదలయ్యే ‘జై హను-మాన్’లో చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
తేజ సజ్జకు నటన కొత్తేమి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన నటనతో మెప్పించాడు. హీరోగాను మంచి మార్కులే సాధించాడు. ఇక హనుమాన్ కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది. కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. కామెడీ, ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్‌ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా.. సూపర్ పవర్స్ ఉన్న హను-మాన్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌్ చూపించి ఆకట్టుకున్నాడు.
హీరో సోదరి అంజనమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా ఇందులో ఓ యాక్షన్స్ సీన్ ఉంది. అమృత అయ్యర్ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్‌ని తెరపై చూడాల్సిందే. వినయ్ రాయ్ స్టైలీష్ విలన్‌గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో గౌరహరి సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా తెరకెక్కించాడు. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment