ఏ కారణంతోనూ షూటింగ్స్ ఆపం..!
పెరంబూరు: ఇకపై వేతనాల విషయంలోనే కాదు ఇతర ఎలాంటి కారణాలతోనూ షూటింగ్‌లను నిలిపివేసే ప్రయత్నాలు చేయమని దక్షిణ భారత సినీ కార్మికులు సమాఖ్య(ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొద్ది రోజులుగా తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులకు, ఫెఫ్సీ నిర్వాహకులకు మధ్య వేతన విషయాల గురించి వివాదం జరుగుతోంది.
దీంతో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, ఫెఫ్సీకి చెందిన సభ్యులు లేకుండానే ఇతర కార్మికులతో షూటింగ్‌లు చేసుకుంటామని వెల్లడించారు. దీంతో ఆయనకు వాట్సాప్‌లో బెదిరింపులు వచ్చాయి.ఈ విషయమై విశాల్ తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇకపై ఫెఫ్సీ సభ్యులెవరూ వేతనాలు విషయాల్లో షూటింగ్‌లను అడ్డుకోరని తెలిపారు.
అదేవిధంగా ఫెఫ్సీ సభ్యుడు ధనపాల్, విశాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానన్నాని అన్నారు. ఇకపై నిర్మాతల మండలికి, ఫెఫ్సీకి మద్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా, నిర్మాతల మండలి, నడిగర్‌సంఘం, దర్శకుల సంఘాలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి చర్చలు జరుపుతామని తెలిపారు.అదే విధంగా విశాల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఫెఫ్సీ సభ్యుడు ధనపాల్ ఈ సందర్భంగా పత్రికాముఖంగా ఆయనకు క్షమాపణ చెప్పారు.