రౌడీలు చుట్టుముట్టారు!
నటిగా భిన్న కోణాలను చూపించగల సత్తా ప్రియాంకా చోప్రాకి ఉంది. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ‘ఫ్యాషన్'లో గ్లామరస్‌గా, ‘బర్ఫీ'లో డీ-గ్లామరైజ్డ్‌గా ఒదిగిపోయిన వైనం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘మేరీ కామ్’ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ బాక్సర్ మేరీ కామ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేరీ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఆహార్యంపరంగా చాలా కసరత్తులే చేశారు ప్రియాంక. అలాగే, బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల మనాలీలోని ఓ గ్రామంలోను, అటవీ ప్రాంతంలోను కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
వీటిలో ఓ పోరాట సన్నివేశం కూడా ఉంది. పాఠశాల నుంచి ఇంటికెళుతున్న మేరీ కామ్‌ని చుట్టుముడితే, వాళ్ల భరతం పట్టే సన్నివేశం అది. ఈ సన్నివేశంలో ప్రియాంక రిస్కీ ఫైట్స్ చేశారని, ఎంతో నేర్పుగా ఆమె చేసిన పోరాటాలు చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారని సమాచారం. షూటింగ్ చేయడంతో పాటు విరామ సమయంలో మనాలీ పరిసర ప్రాంతాలను సందర్శిస్తున్నారట ప్రియాంక. అక్కడి హడింబా దేవి ఆలయాన్ని సందర్శించి పూజలు కూడా చేశారు.