ఆ సినిమాలు రూ.60కోట్లు ముంచాయి
ముంబయి: షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో ఏ స్థాయి హీరోలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ బాక్సాపీసు రికార్డులు తిరగరాయడం మొదలుపెట్టింది వీరే. ఇంత క్రేజ్ ఉన్న ఈ నటులకు ఈ మధ్య ఏమాత్రం కలిసి రావడం లేదు. వారు నటించిన చిత్రాలు ఈ మధ్య చడిచప్పుడు లేకుండా పడకేస్తున్నాయి. ముఖ్యంగా ఆరు వారాల కిందట సల్మాన్ నటించి ట్యూబ్‌లైట్ చిత్రం బాక్సాపీసు వద్ద బోల్తా కొట్టగా.. ఇప్పుడు అదే బాటలో షారుక్ నటించిన తాజా చిత్రం జబ్ హ్యారీ మెట్ సెజ్జల్ సినిమా పరిస్థితి అంతే తయారైంది.
పైగా ఈ నటులు ఇలాంటి సినిమాలు చేయడమేమిటంటూ సోషల్ మీడియాలో చెప్పలేని కామెంట్లు పోగవుతున్నాయి. ఈ నటుల విషయం పక్కన పెడితే, ఈ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించిన వారి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. సల్మాన్, షారుక్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ఎన్‌హెచ్ స్టూడియోకు చెందిన నరేంద్ర హిరావత్ భారీ మొత్తంలో నష్టపోయాడంట. ఆయన ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.60కోట్లు నష్టం చవిచూశారంట.
అయితే, ట్యూబ్‌లైట్ దెబ్బకొట్టడంతో పంపిణీదారులకు నష్టపరిహారం చెల్లిస్తామంటూ సల్మాన్ తండ్రి సలీంఖాన్ చెప్పగా ఇప్పటి వరకు తమకు ఎలాంటి పరిహారం అందలేదని నరేంద్ర స్పష్టం చేశారు. అయితే, సలీం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని తాము నమ్ముతున్నామని చెప్పారు. అయితే, అలాగే షారుక్ చిత్రం కూడా నష్టం కలిగించిన నేపథ్యంలో వారు కూడా కొంత పరిహారం చెల్లిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఈ ఇద్దరు హీరోల సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించినట్లు చెప్పారు.