
తమిళసినిమా: సినిమా తారలను ముఖ్యంగా హీరోయిన్లు సగటు ప్రేక్షకుడికి కలల రాణులు. కార్లు, బంగ్లాలు, సమాజంలో వారికున్న పేరు ఇత్యాధి వారి జీవన విధానాలు సామాన్యుడిని అబ్బురపరుస్తాయి. అయితే పీత కష్టాలు పీతవి అన్న సామెత మాదిరి హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న హీరోయిన్లు ఒక్కోసారి అనుకోని ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు. నటి మెహరీన్ కూడా ఇటీవల అలాంటి ఇక్కట్లనే ఎదుర్కొంది. ఈ బ్యూటీ టాలీవుడ్‌లో యువ స్టార్స్ సరసన నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. కోలీవుడ్‌లో నోటా అనే చిత్రంలో నాయకిగా నటిస్తోంది. అర్జున్‌రెడ్డి చిత్రం ఫేమ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్నారు. దీంతో తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్ అంటూ విమానాల్లోనే తిరిగేస్తున్న మెహరీన్ నోటా చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ దొరకపోవడంతో రైలు ప్రయాణం చేయడానికి సిద్ధమైంది.
అయితే నిర్మాతలు తన కోసం బుక్ చేసిన బెర్త్‌ను అప్పటికే ఒక వ్యక్తి ఆక్రమించుకోవడం, అతను పుల్‌గా మద్యం తాగి ఉండడంతో నటి మెహరీన్ భయంతో వణికిపోయింది. చాలా సమయం అలానే రైలులో నిలబడే ప్రయాణం చేసింది. ఆ తరువాత పరిస్థితిని నిర్మాతకు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఒక కారులో తన మనుషులను పంపి ఆమెను అదే కారులో చెన్నైకి తీసుకురావడానికి ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నోటా చిత్ర వర్గాలు తెలిపాయి. నిజం చెప్పాలంటే సెలబ్రిటీలకు రైలు ప్రయాణమే కాదు, ఫ్లైట్ ప్రయాణాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నడిగర్ సంఘ నిర్వాహకులు హీరోహీరోయిన్ల ప్రచారంలో తగిన భద్రత కల్పించాలని నిర్మాతలకు సూచిస్తున్నారు. అయినా నటి మెహరీన్‌కు ఎదురైన లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.