![యుద్ధం చేసిన ప్రతిసారీ గెలుపు వైవీయస్‌దే : వీవీ వినాయక్](/styles/webp/s3/article_images/2017/09/2/71426700065_625x300.jpg.webp?itok=avCfiumn)
యుద్ధం చేసిన ప్రతిసారీ గెలుపు వైవీయస్‌దే : వీవీ వినాయక్
‘‘చిరంజీవిగారు పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లయినా ఆయన హవా ఇప్పటికీ తగ్గలేదు. ఆయన ఆశీస్సులతోనే పవన్ కల్యాణ్ ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే తమ ప్రతిభ నిరూపించుకున్నారు. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా చిరంజీవిగారిదే’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘రేయ్’. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ కథానాయికలు.
బొమ్మరిల్లు వారి పతాకంపై యలమంచిలి గీత సమర్పణలో వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘పవనిజం’ పాటను ఆర్. నారాయణమూర్తి విడుదల చేశారు. వైవీయస్ మాట్లాడుతూ -‘‘ ‘తొలిప్రేమ’ సినిమా తర్వాత పవన్‌కల్యాణ్‌తో సినిమా చేద్దామనుకున్నా కుదర్లేదు. సాయిధరమ్ కోసం ఆయనకు కథ చెబితే, నచ్చి ఒప్పుకున్నారు. రిస్క్ ఉంది చేస్తావా..? అని అడిగారు. తప్పకుండా చేస్తానన్నా. ఆయనకిచ్చిన మాట కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి ఈ సినిమా చేశా.
100 శాతం సంతృప్తినిచ్చింది. ఈ సినిమాకు చక్రి మంచి సంగీతం అందించారు’’ అని చెప్పారు. ‘‘ ‘పవనిజం’ అనే పదం జనం నుంచి పుట్టింది. మేం చాలా ఎగ్జైట్ అయి, ఈ పాటను చేశాం’’ అని హీరో అన్నారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ -‘‘యుద్ధం చేసిన ప్రతిసారీ వైవీయస్ గెలుస్తాడు. ఈసారి కూడా గెలుపు ఖాయం’’ అని చెప్పారు. చంద్రబోస్, సయామీఖేర్, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.