అందుకే.. జీవితంలో అసలు పెళ్లే చేసుకోను! | Sai Pallavi About Her Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోను!

Published Fri, Jun 14 2019 7:03 AM | Last Updated on Fri, Jun 14 2019 7:03 AM

Sai Pallavi About Her Marriage - Sakshi

తమిళసినిమా: విజయాలను అందుకోవడం అంత ఈజీ కాదు. కొందరికి నేమ్,ఫేమ్‌ ఉన్నా విజయాలు దగ్గరికి రావడానికి దోబూచులాడుతుంటాయి. అందుకే పెద్దలు అంటుంటారు ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలని. ఇదుగో నటి సాయిపల్లవిది కోలీవుడ్‌లో ఇందే పరిస్థితి. మాలీవుడ్‌లో మలర్‌ చిత్రంతో వికసించిన కథానాయకి ఈ అమ్మడు. ఆ చిత్రంలో టీచర్‌గా అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడికి మాతృభాషతో పాటు దక్షిణాదిలోనే క్రేజ్‌ వచ్చేసింది. అంతేకాదు టాలీవుడ్‌లో అవకాశాలు తలుపు తట్టేశాయి. అలా అక్కడ సాయిపల్లవి నటించిన ఫిదా చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసింది. అదే విధంగా ఎంసీఏ చిత్రం హిట్‌ అయ్యింది. దీంతో అక్కడ సాయిపల్లవి పేరు మారు మోగింది. అంతే అ తరువాత సాయిపల్లవికి సక్సెస్‌ ముఖం చాటేసింది. ఇక కోలీవుడ్‌లో నటించిన మూడు చిత్రాలు ఈ అమ్మడి కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.

దయ, మారి–2, ఎన్‌జీకే ఈ మూడు చిత్రాల్లో ధనుష్‌తో జత కట్టిన మారి–2 చిత్రం కాస్త మెరుగు. అందులో రౌడీ బేబీ పాట సాయిపల్లవిని చాలా పాపులర్‌ చేసిందనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీకి ఏ భాషలోనూ కొత్త అవకాశాలు కనుచూపు దూరంలో కనిపించడం లేదు. ఇంతకు ముందు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా అవకాశాలు లేకుంటే వైద్యం వృత్తి చేసుకుంటానని చెప్పిన సాయిపల్లవి తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. హీరోయిన్‌ అన్న వారెవరికైనా ఎదురైయ్యే ప్రశ్న ఎవరినైనా ప్రేమించారా?పెళ్లి ఎప్పుడు? అన్నవే. అయితే నటి సాయిపల్లవికి మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నే ఎదురవుతోందట.

అందుకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పేర్కొంటూ తాను అసలు పెళ్లే చేసుకోను అని చెప్పింది. కారణం ఏమిటంటే తాను పెళ్లి చేసుకుంటే తన తల్లిదండ్రులను చూసుకోవడం కుదరదని పేర్కొంది. అందుకే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చింది. సాయిపల్లవి చెప్పిన కారణం నమ్మశక్యంగా ఉందా? ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా నటిగా మాలీవుడ్, టాలీవుడ్‌లలో సక్సెస్‌లు చూసిన ఈ అమ్మడికి కోలీవుడ్‌లో మాత్రం అది ఇంకా అందని ద్రాక్ష లాగానే ఉండిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఒక్క అవకాశం కూడా చేతిలో లేదాయే. ఎన్‌జీకే చిత్రంలో ఈమెతో పాటు నటించిన నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాత్రం విజయ్‌తో రొమాన్స్‌ చేసే క్రేజీ ఆఫర్‌ను దక్కించుకుందనే ప్రచారం హోరెత్తుతోంది.ఇందుకు కారణం రకుల్‌ప్రీత్‌సింగ్‌ గ్లామర్‌ను నమ్ముకుంది. సాయిపల్లవి నటనను నమ్ముకోవడమేననుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement