ఒకే బ్యానర్లో మూడు సినిమాలు..!
మలయాళ సినిమా ప్రేమమ్తో సౌత్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం ఈ భామ వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాలో నటిస్తోంది. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాతో పాటు అదే బ్యానర్ లో మరో రెండు సినిమాలకు ఓకె చెప్పిందట సాయి పల్లవి. ఫిదా సినిమాతో పాటు ఒకేసారి మూడు సినిమాలు చేసేలా దిల్ రాజు సాయి పల్లవితో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంతేకాదు మూడు సినిమాలకు కలిపి పేమెంట్ కూడా ఒకేసారి చేసేశాడన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఫిదా సినిమాను పూర్తి చేసిన ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న ఎమ్సీఏ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత కూడా దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా చేయనుంది. ప్రస్తుతం సతీష్ వేగ్నేష్, దశరథ్, శ్రీకాంత్ అడ్డాలలు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ ఉన్నారు. వీటిలో ఏదో ఒక సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది.