సాక్షి, హైదరాబాద్ : నాకూ బాగా ఆనందం వేసినప్పుడు నాన్నని ‘హేయ్..సత్తి నా పాట చూశావా? ఎలా ఉందేంటి? ఏంటీ ఏం మాట్లాడట్లేదు’ అంటూ పిలిచేవాడ్ని. ఆయన కూడా అంతే జోష్‌లో ‘రేయ్ కొడతా..పెద్ద డైరెక్టర్ అయ్యావని పేరుతో పిలుస్తున్నావా? నాకు దొరకవా..నువ్వు’ అంటున్న సమయంలో ఆ సంతోషానికి అవధులు లేకుండా పోయేవని ప్రముఖ సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్ అన్నారు. నాన్నను కొన్ని సందర్భాల్లో అలా పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా..! ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నతో గడిపిన ఆ సరదా సన్నివేశాలు, నాన్న నన్ను మెచ్చుకున్న సందర్భాలు, ఇతరులను ఆదర్శంగా తీసుకోవాలనే ఆయన సూచించే సూచనలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. నాన్న కొట్టాడని, తిట్టాడని, అరిచాడని మనం అలిగి ఆయనపై నిందలు వేస్తే మన జీవితానికి అర్థం లేదంటూ ‘ఫాదర్స్‌డే’ సందర్భంగా దేవీశ్రీప్రసాద్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. తండ్రి సత్యమూర్తితో ఆయనకున్న అనుబంధం ఆయన మాటల్లోనే..
తప్పు చేస్తే కొట్టేవారు కాదు
నాన్న మంచి ఒక టీచర్, మంచి రైటర్, సింగర్ కూడా. ఆయన టీచర్ కావడంతో పిల్లలతో ఎలా ఉండాలనేది బాగా తెలుసు. అనుకోకుండా ఏదైనా తప్పు చేస్తే కొట్టేవారు కాదు తిట్టేవారు. ఆ తప్పు వల్ల పిల్లలు ఎలాంటి చెడు మార్గంలో వెళతారు అనేది ఏదైనా ఒక ఉదాహరణ ద్వారా చెప్పేవారు. పిల్లలకు ఇది చేయొద్దు అంటే అదే చేస్తారు కాబట్టి ఆయన కొత్తగా ట్రై చేసేవారు. స్కూల్లో టీచర్లు కంప్లైంట్ చేస్తే వాళ్లకు క్లాస్ తీసుకునేవారు.(ధనుష్ చిత్రాలను రజినీ ఎందుకు నిరాకరించారు?)
‘నాన్నకు ప్రేమతో’ దగ్గరయ్యా..
హీరో ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’లో టైటిల్ సాంగ్ ‘నాన్నకు ప్రేమతో’ సాంగ్‌ని రాసి పాడాను. ఆ పాట ఎంత విజయవంతం అయ్యిందో..ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు. అప్పటి వరకు ఎందరో పిల్లలు వాళ్ల తండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం, గౌరవించకపోవడం, ప్రేమించకపోవడం వంటివి చేసేవారు. ఈ సాంగ్ విన్నాక కొన్ని లక్షల మంది నాకు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్‌లలో సందేశాలు పంపారు. మీరు రాసి, పాడిన పాట మా హృదయాలను ఎంతో తాకింది, మా నాన్నపై ప్రేమ, గౌరవం, ఆప్యాయత, అనురాగం పెరిగిందన్నారు. లైఫ్‌లో ఇంతకన్నా బెస్ట్ ఇంకేం ఉంటుంది?.
నా హృదయానికి బాగా నచ్చిన పాట అది.
ఇళయరాజా వస్తున్నాడనేవారు
పెద్దాయ్యాక నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావని స్కూల్లో అడిగారు. నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా అన్నాను. అంతే..ఆ తర్వాత రోజు నుంచి నేను స్కూలుకు వస్తుంటే ‘అరేయ్ ఇళయరాజా’ వస్తున్నాడురా అని ఆటపట్టించేవారు. ఈ విషయాన్ని నాన్నకు చెబితే నాన్న నవ్వేవారు. వాళ్లు అలా ఆటపట్టిస్తున్నారు కదా? నువ్వు దానిని సీరియస్‌గా తీసుకో..మ్యూజిక్ డైరెక్టర్ అయిపో అంటూ నా భుజం తట్టి, నాలో సంకల్పాన్ని నింపిన గొప్ప వ్యక్తి మా నాన్న.
ఏటా ఊరికి వెళ్లేవాళ్లం
మాది తూర్పుగోదావరిలోని ‘వెదురుపాక’ గ్రామం. మేం చెన్నైలో సెటిల్ అయినప్పటికీ..మాకు సొంత ఊరుపై మమకారం ఉండాలని అక్కడ అన్ని సౌకర్యాలతో మంచి ఇల్లు కట్టారు. ప్రతి ఏటా సంక్రాంతి, దసరా సమయాల్లో వెదురుపాక వెళ్తుండేవాళ్లం. నాన్న కొనిచ్చిన కారు ఇప్పటికీ జ్ఞాపకంగా ఉంచుకున్నాను. ఈ ఐదేళల్లో నాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.
నాన్నను ప్రేమిద్దాం
ఎంత తప్పు చేసినా కడుపులో పెట్టుకుని క్షమించే దయాహృదయుడు నాన్న మాత్రమే. నాన్న మనతో ఉన్నంత వరకు మన వెనక ఉన్న కొండంత బలాన్ని మనం అంచనా వేయలేం. అందిపుచ్చుకోలేం, గ్రహించలేం. ఒక్కసారి ఆ అండ దూరమైతే ఆయన వాల్యూ ఏంటి అనేది అప్పుడే తెలుస్తుంది. కోపంలో నాన్న తిట్టాడని, కొట్టాడని, అరిచాడని మీరు మీ ఫ్రెండ్స్ వద్ద నాన్న గురించి తప్పుగా మాట్లావద్దు. లోపల ఏదైనా బాధ, ఆలోచన ఉంటేనే మనపై అరుస్తారు. కాబట్టి మనందరం నాన్నని ప్రేమిద్దాం, గౌరవిద్దాం..పూజిద్దాం. మనల్ని కన్న తల్లిదండ్రులకు మనమిచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment