నాట్యం.. ఆమె లైఫ్‌ పార్ట్‌నర్‌! | Sakshi interview with Shobana | Sakshi
Sakshi News home page

ఏడడుగులూ నాట్యమే

Published Sun, Oct 28 2018 12:54 AM | Last Updated on Sun, Oct 28 2018 10:15 AM

Sakshi interview with Shobana

శోభన

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక తపన ఉంటుంది. ఆ తపన.. ఆ ప్యాషన్‌.. ఒక్కోసారి సప్తపదిని కూడా మరిపించేస్తుంది. అలాంటి తపన, ప్యాషన్‌.. అనురక్తి, అనుశక్తి అయిన నాట్యాన్ని వివాహం చేసుకున్నారు శోభన! నాట్యం.. ఆమె లైఫ్‌ పార్ట్‌నర్‌. లైఫ్‌.. ఆమె నాట్యానికి.. ఏడడుగుల సోపానం.. శోభాయమానం.

జీవితంలో చాలా ఉంటాయి. అప్పుడు సినిమా ఓ భాగం మాత్రమే అనిపిస్తుంది. డ్యాన్స్‌ అనేది కూడా కెరీరే కదా.
క్లాసికల్, రొమాంటిక్‌ సాంగ్‌ అనేది ఉండదు. ఉండేదల్లా ‘కాన్సెప్ట్‌’ మాత్రమే. దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్‌ ప్రకారం ఆర్టిస్టులు చేయాలి.
పాతికేళ్లలో చెంగు చెంగున దూకుతూ డ్యాన్స్‌ చేసినట్లు 50 ఏళ్లలోనూ చేయగలిగితే గ్రేటే. కానీ అది అసాధ్యం.
పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటారు, చేసుకోకపోతే ఉండలేరు అని రూల్‌ ఏం లేదు. ఇది కరెక్ట్, ఇది తప్పు అని ఉండదు.
మగపిల్లవాడికి తన తండ్రే రోల్‌ మోడల్‌. అందుకే తండ్రి తీరు బాగుండాలి. పిల్లలకు ఆ తండ్రి ఒక మంచి ఉదాహరణ అవ్వాలి.
సినిమా మీద ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది కాబట్టి ఈ ఇండస్ట్రీ గురించి బయటకు తెలుస్తుంది. కానీ వేరే చోట కూడా వేధింపులు ఉంటాయి.


సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకలా?
శోభన: నేను సినిమాలు మానేయలేదు. జీవితంలో చాలా ఉంటాయి. అప్పుడు సినిమా ఓ భాగం మాత్రమే అనిపిస్తుంది. డ్యాన్స్‌ అనేది కూడా కెరీరే కదా. ‘కళార్పణ’ పేరుతో నాకో డ్యాన్స్‌ స్కూల్‌ ఉంది. సమయమంతా దాంతో సరిపోతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సినిమాలను ప్రదర్శించాలనే ఆశయంతో నెలకొల్పిన ‘జాదూజ్‌ సెంటర్‌’కి సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. అన్ని ప్రాంతాలకూ వెళతారా?
అన్నింటికీ వెళ్లాలంటే కుదరదు. కొన్ని గ్రామాలకు వెళ్లాలనుకుంటున్నాను. నిజానికి ‘జాదూజ్‌’ ప్లాన్‌ చేసినప్పుడు నేను దీన్ని ఓ వ్యాపారంలానే భావించాను. చిన్న చిన్న ఊళ్లల్లో సినిమాలు చూపించడంతో పాటు అక్కడే కేఫ్‌లు, టిఫిన్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేసి, వారికి ఓ మంచి ఫీల్‌ని కలిగించే అవకాశం ఉంది. చిన్న ఊళ్లకు కూడా మాల్స్‌ లాంటివి తీసుకువెళ్లొచ్చనే ఉద్దేశంతో ‘జాదూజ్‌’లో భాగమయ్యాను. పైగా నేను స్వయంగా అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. నా ఆలోచనలను ఆచరణలోకి తీసుకు రావడానికి ఓ టీమ్‌ ఉంది.

మీరు మంచి నటి, నాట్య కళాకారిణి. అందరి మనసుల్లో నటిగానే గుర్తుండిపోవాలనుకుంటారా? నృత్య కళాకారిణిగానా?
ఈ రెంటికీ వ్యత్యాసం చెప్పమంటే చెప్పలేను. నాకు రెండూ ఇష్టమే. ఒకప్పటి నటీమణులు వైజయంతి మాల, హేమ మాలిని, మా అత్తయ్య పద్మినీగార్లను తీసుకుందాం. వీళ్లు మంచి క్లాసికల్‌ డ్యాన్సర్స్‌. అద్భుతమైన ఆర్టిస్టులు కూడా. సినిమాల్లో వాళ్లు ఎన్నో క్లాసికల్‌ సాంగ్స్‌కి డ్యాన్స్‌ చేశారు. ప్రేక్షకులు వీళ్లను మంచి నటీమణులుగానూ, నృత్య కళాకారిణులుగానూ ఆమోదించారు. నన్నూ అలానే గుర్తుంచుకుంటారని అనిపిస్తోంది.

మీ అత్తయ్యలు పద్మినీ, రాగిణి, లలితగార్లను ‘ట్రివాంకూర్‌ సిస్టర్స్‌’ అనేవారు. వాళ్లు క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకుని, సినిమాల్లోకి వచ్చారు. మీరూ అంతే. క్లాసికల్‌ అనేది ట్రెడిషనల్‌ ఆర్ట్‌.. సినిమా డిఫరెంట్‌ కదా?
వేరే వేరు అనుకుంటే వేరు అనిపిస్తుంది. రెండూ వేరు కాదు. అత్తయ్యల్లానే నేనూ క్లాసికల్‌ నేర్చుకున్నాను. వాళ్లలానే సినిమాల్లోకి వచ్చాను. రెండూ ఆర్ట్సే. మొదట్లో మ్యాథ్స్‌ ఉండేది. ఆ తర్వాత దాంతో పాటు జ్యామెంటరీ, అల్జీబ్రా అని కొత్త కొత్తవి వచ్చాయి. సబ్జెక్ట్స్‌ పెరుగుతున్నాయి. కళ కూడా అంతే. రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. ఎన్ని రూపాలుగా వచ్చినా మనం ఫైనల్‌గా ‘కళ’ అనే అంటాం కదా. నాట్యం అనేది ఒక కళ అనుకుంటే సినిమా కూడా కళే.

‘రుద్రవీణ’ లో ‘లలిత ప్రియ కమలం..’ పాట క్లాసికల్‌ టచ్‌తో ఉంటుంది. సినిమాల్లో చేసిన రొమాంటిక్‌ డ్యాన్స్, క్లాసికల్‌ డ్యాన్స్‌.. దేన్ని బాగా ఎంజాయ్‌ చేశారు?
‘ఇదే ఇష్టం’ అంటే కళకు న్యాయం జరగదు. ఏదైనా కళే కదా. మన సామర్థ్యం మేరకు ఆ ఆర్ట్‌ని పరిపూర్ణంగా చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. క్లాసికల్, రొమాంటిక్‌ సాంగ్‌ అనేది ఉండదు. ఉండేదల్లా ‘కాన్సెప్ట్‌’ మాత్రమే. ఆ కాన్సెప్ట్‌ బాగా రావాలంటే నటీనటులు బాగా చేస్తే సరిపోదు. డైరెక్టర్, కెమెరామేన్‌ బాగా క్యాప్చర్‌ చేయాలి.


(‘రుద్రవీణ’లో... , ‘అభినందన’లో... )

బేసిక్‌గా మీరు క్లాసికల్‌ డ్యాన్సర్‌ కాబట్టి సినిమాల్లో వచ్చే మాస్‌ సాంగ్స్‌పై మీ ఒపీనియన్‌?
క్లాసికల్‌ మ్యూజిక్‌ ఇష్టపడేవారికి మాస్‌ కూడా నచ్చుతుంది. క్లాస్‌ అయినా మాస్‌ అయినా... రెండూ మ్యూజిక్కే కదా. అందుకని మాస్‌ సాంగ్స్‌ని తక్కువ చేసి మాట్లాడలేం.

ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో నటిగా మీ ప్రతిభ మొత్తం చూపించడానికి స్కోప్‌ దక్కిందా?
అలా ఫుల్‌ స్కిల్‌ ఉపయోగించి చేసింది ఏదీ లేదు. అలాంటì  పాత్ర రాలేదని కాదు. టాలెంట్‌కి కొలమానం ఉండదు. మలయాళంలో ‘మణిచిత్ర తాళ్, తెలుగులో ‘రుద్రవీణ’ వంటి మంచి సినిమాలు చేశాను. అలాంటి మంచి సినిమాల్లోనూ భాగం అయ్యే అవకాశం దక్కడం నా భాగ్యం. ఎందుకంటే మనం మాత్రమే బాగుండి, మనం బాగా యాక్ట్‌ చేస్తే సరిపోదు. సినిమా కూడా బాగుండాలి. అలా బాగున్న సినిమాలు ఎన్నో చేశాను.

పాతికేళ్లలో ఉన్నంత ఎనర్జిటిక్‌గా 40 ఏళ్లలో ఉండలేం. పాతికేళ్లలో డ్యాన్స్‌ చేసినట్లుగా ఆ తర్వాత కూడా చేసేంత సామర్థ్యం ఉంటుందా?
ఉండకపోవచ్చు. ఎందుకంటే డ్యాన్స్‌ అనేది ఫిజికల్‌ ఆర్టే కదా. పాతికేళ్లలో చెంగు చెంగున దూకుతూ డ్యాన్స్‌ చేసినట్లు 50 ఏళ్లలోనూ చేయగలిగితే గ్రేటే. కానీ అది అసాధ్యం. అయితే కొన్నేళ్లుగా ప్రేక్షకులు ఆ పెర్ఫార్మెన్స్‌కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి అదే ‘గ్రేస్‌’ ఉండాలనుకుంటారు. అది తప్పు కాదు. కళాకారులు కూడా ఎప్పుడూ ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేయడానికే కృషి చేస్తుంటారు.

డ్యాన్స్‌ అనేది మంచి ఎక్స్‌ర్‌సైజ్‌. బహుశా మీ ఫిజిక్‌ బాగుండటానికి ఈ ఎక్సర్‌సైజ్‌ మెయిన్‌ రీజన్‌ అనుకోవచ్చా?
అది కొంతవరకూ నిజమే. మిగతాది మనం ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మైండ్‌ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేనేం చేస్తున్నానో చెప్పాననుకోండి.. అది మీ శరీర తత్వానికి సరిపడక పోవచ్చు. ముందు మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎలా తినాలి? ఎంతసేపు ఎక్సర్‌సైజ్‌ చేయాలి? అనే విషయాలను ప్లాన్‌ చేసుకోవాలి. అతిగా తినకూడదు. ఆయిల్‌ ఫుడ్‌ తీసుకోకూడదు. పంచదార తియ్యగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి హాని.

మీరు రోజూ ఎన్ని గంటలు డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తారు?
నాలుగు గంటలు ప్రాక్టీస్‌ చేస్తా. అది కూడా ఉదయం.

4 గంటలు డ్యాన్స్‌ చేయగల సామర్థ్యం ఉంటుందా?
ఇప్పటికిప్పుడు మొదలుపెడితే కష్టమే. చిన్నప్పటినుంచి చేస్తున్నాను కాబట్టి నాలుగు గంటలనేది నాకు పెద్ద విషయం కాదు. అంతసేపు చేస్తున్నాను కాబట్టే ఈరోజు నేనిక్కడ ఉన్నాను.

సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు అంటూ ఇటీవల ఫీమేల్‌ ఆర్టిస్టులు బయటికి చెబుతున్నారు. ఇండస్ట్రీలో మీకలాంటి అనుభవాలేమైనా?
నాకు బాధపడే పరిస్థితులు ఎదురు కాలేదు. అందుకని ఇండస్ట్రీ మీద సదభిప్రాయం ఉంది. సినిమా మీద ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది కాబట్టి ఈ ఇండస్ట్రీ గురించి బయటకు తెలుస్తుంది. కానీ వేరే చోట కూడా వేధింపులు ఉంటాయి. ఆడవాళ్లను వేధించేది ఎవరు? మగవాళ్లు. వాళ్ల ప్రవర్తన బాగుంటే వేధింపులు ఉండవు.

కొందరి ప్రవర్తన బాగా లేకపోవడానికి కారణం ఏమిటంటారు?
మగపిల్లవాడికి తన తండ్రే రోల్‌ మోడల్‌. అందుకే తండ్రి తీరు బాగుండాలి. పిల్లలకు ఆ తండ్రి ఒక మంచి ఉదాహరణ అవ్వాలి. అలాగే  ‘ఆడపిల్లలేగా’ అని తోడబుట్టినవాళ్లను మగపిల్లవాడు చులకనగా చూస్తే.. రేపు భార్య మీద కూడా ఆ ఫీలింగే ఉంటుంది. స్కూల్‌ వాతావరణం బాగుండాలి. ఇంటి నుంచి బయటికెళ్లాక ఆ పిల్లాడేం చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

సినిమాల ప్రభావం యువతపై ఉంటుందా?
రోడ్‌ సైడ్‌ రోమియో లాంటి క్యారెక్టర్స్‌ చూసినప్పుడు ‘ఇలా ఉండటం కామన్‌’ అనుకునే ప్రభావం ఉంది. ఆ పాత్ర ఆ అబ్బాయి క్యారెక్టర్‌ని రిఫ్లెక్ట్‌ చేస్తుంది. కానీ ఏ విషయంలో అయినా మంచిని తీసుకోవాలి. సినిమాలు కాకపోతే చెడు ఇంకో చోట కనిపిస్తుంది. దానికి ఎట్రాక్ట్‌ అవ్వకుండా ఉండాల్సిన బాధ్యత మనదే. అందుకే సినిమాలు ఓ సమస్య కానే కాదు. మామూలుగా మగపిల్లాడికి 10, 11 ఏళ్లు వచ్చాక ‘ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు’ అని చెబుతుంటారు. కానీ 3, 4 ఏళ్ల వయసు నుంచే ఆడవాళ్ల దగ్గర ఎంత బాగా బిహేవ్‌ చేయాలో నేర్పించాలి. ఇప్పుడు సమాజంలో వేధింపులు పెరిగాయి కాబట్టి, బహుశా మగపిల్లవాడు పుట్టినప్పటి నుంచే చెప్పడం మొదలుపెట్టాలేమో!

మీరు పెట్టుకునే నగలన్నీ బాగుంటాయి.. మంచి టేస్ట్‌ ఉందనిపిస్తోంది?
నగలంటే ఇష్టం. కంటికి నచ్చేవాటికే ప్రాధాన్యం ఇవ్వకుండా నాకు నప్పేవాటిని సెలెక్ట్‌ చేసుకుంటాను. చీరలైనా అంతే.

మీకు ఎవరు ఇన్‌స్పిరేషన్‌?
మంచి విషయాలు చెప్పే అందరూ ఇన్‌స్పిరేషనే. పర్టిక్యులర్‌గా అంటే నా భరత నాట్యం గురువులు చిత్రా విశ్వేశ్వరన్, పద్మా సుబ్రహ్మణ్యంగార్లు చాలా విషయాల్లో నాకు ఆదర్శం.

మీరు నిర్వహిస్తున్న డ్యాన్స్‌ స్కూల్‌ ‘కళార్పణ’లో మీరూ డ్యాన్స్‌ నేర్పిస్తుంటారా?
ఒకప్పుడు నేర్పించేదాన్ని. ఇప్పుడు తగ్గించేశాను.

స్టేజ్‌ షోలు చేసినప్పుడు అక్కడికక్కడే ఆడియన్స్‌ రెస్పాన్స్‌ తెలుసుకోవడం ఎలా అనిపిస్తుంది?
మన జాబ్‌ సిన్సియర్‌గా చేయాలనే థాట్‌తో స్టేజ్‌ మీదకి వెళతాం. అభినందనలతో పాటు చాలాసార్లు విమర్శలు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి ఆ విమర్శల్లో నిజం ఉండొచ్చు. ఆర్ట్‌ గురించి తెలియక చేసిన కామెంట్స్‌ కూడా ఉంటాయి. అయినా విమర్శలను పట్టించుకుంటాను. ఇప్పుడు బాగానే చేశాం అనే ఫీలింగ్‌ ఉన్నప్పటికీ నెక్ట్స్‌ టైమ్‌ ఇంకా బాగా చేయాలని అనుకుంటాను.

మణిరత్నం ‘రావణ్‌’లో ఐశ్వర్యా రాయ్‌ చేసిన ఓ పాటకు కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఆ అనుభవం గురించి?
నిజానికి మణిరత్నంగారు కొరియోగ్రాఫర్‌ లేకుండానే సాంగ్‌ తీయగలరు. ఆ సినిమాకి అడిగారు కాబట్టి చేశాను. కొరియోగ్రాఫర్‌ చెప్పింది ఆర్టిస్ట్‌ ఈజీగా అర్థం చేసుకుంటే పని సులువు అవుతుంది. ఐశ్వర్యా రాయ్‌కి మంచి మ్యూజిక్‌ సెన్స్‌ ఉంది. ఆమె ఉత్సాహం, ప్రతిభ నన్ను మోటివేట్‌ చేశాయి. నేను ఓ నటిని అనే విషయాన్ని మరచిపోయి కొరియోగ్రాఫర్‌గా ఆ సెట్స్‌లోకి అడుగుపెట్టాను. అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్‌.

ఫైనల్లీ... ఆడవాళ్లు ఒంటరిగా బతకడం కష్టం కాబట్టి పెళ్లి చేసుకోవాలంటారు. మీది సోలో లైఫ్‌ కాబట్టి సమస్యలేమైనా? పెళ్లెందుకు చేసుకోలేదు?
పెళ్లెందుకు చేసుకోలేదనేది నా వ్యక్తిగత విషయం. దాని గురించి మాట్లాడదలచుకోలేదు.  అయితే పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటారు, చేసుకోకపోతే ఉండలేరు అని రూల్‌ ఏం లేదు. ఇది కరెక్ట్, ఇది తప్పు అని ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కో పాయింట్‌ ఆఫ్‌ వ్యూ ఉంటుంది. అందరి అనుభవాలు ఒకలా ఉండవు.  లైఫ్‌  స్పెషాలిటీ అదే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement