
బాడీగార్డ్ దగ్గర సల్మాన్ అప్పు!
హిందీ రంగంలో కోట్లు కోట్లు సంపాదిస్తున్న హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. సినిమాలు, యాడ్స్, అప్పుడప్పుడూ టీవీ షోస్ చేస్తున్న సల్మాన్ దగ్గర డబ్బుల్లేవంటే అందరూ ఆశ్చర్యపోతారు. పైగా, తన బాడీగార్డ్ దగ్గర అప్పు తీసుకున్నాడంటే చాలా చాలా ఆశ్చర్యపోతారు. ఇంతకీ సల్మాన్‌కి అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే విషయంలోకి వస్తే... ముంబయ్‌లోని బాంద్రాలో గల ఓ ఫేమస్ రెస్టారెంట్‌కి సల్మాన్ ఖాన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికెళ్లిన సల్మాన్ టేస్టీ టేస్టీ ఫుడ్ లాగించి, బయటికొచ్చారు. అక్కడ కలరింగ్ పుస్తకాలు అమ్ముతున్న కొంతమంది పిల్లలు సల్మాన్‌ని చూసి, ఆయన దగ్గరకు పరిగెత్తు కుంటూ వచ్చారు. కొన్ని పుస్తకాలు కొనమని అభ్యర్థించారు. పిల్లలకు డబ్బులివ్వడానికి పర్సు తీసి చూస్తే, క్రెడిట్ కార్డులూ, డెబిట్ కార్డులూ తప్ప క్యాష్ కనిపించలేదు. వెంటనే పక్కనే ఉన్న తన బాడీగార్డ్ దగ్గర డబ్బులు అప్పుగా తీసు కుని, అక్కడున్న పిల్లలందరికీ తలా 500 రూపాయలు ఇచ్చారు సల్మాన్. ఈ ‘బజ్‌రంగీ భాయీజాన్’ చర్యతో ఆ పిల్లలెంత ఆనందపడి పోయి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.