‘ట్యూబ్‌లైట్’ సినిమా విడుదలైన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ట్యూబ్‌లైట్ సినిమాను 2017లో రంజాన్ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. సినిమాలో చాలా సన్నివేశాల్లో సల్మాన్ బాధపడుతూనే ఉండటం ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.
తాజాగా సల్మాన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ‘‘బజరంగీ భాయ్‌జాన్’ (2015) సినిమా హిట్ అయిన నేపథ్యంలో.. అదే తరహాలో ఉండే ‘ట్యూబ్‌లైట్’ కూడా ఓ అందమైన సినిమా అవుతుందని భావించాం. కానీ పండగ రోజున సంతోషాన్ని ఇచ్చే సినిమా చూడాలని అభిమానులు అనుకున్నారు. ‘ట్యూబ్‌లైట్’ చూసి.. వాళ్లంతా ఏడ్చారు. ‘అసలు ఇది ఏం సినిమా.. పండగను నాశనం చేసేశాడు’ అన్నారు. పాపం కొంతమంది అభిమానులు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయారు’ అని తెలిపాడు.
‘ఇవాళ ‘ట్యూబ్‌లైట్’ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. టీవీలో సినిమాను చూస్తూ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలకు ఈ సినిమా బాగా నచ్చింది.. మంచి రేటింగ్ వస్తోంది. సినిమా దేశవ్యాప్తంగా రూ.110 కోట్లు రాబట్టింది. అంటే.. నా ఫ్లాప్ సినిమాలు కూడా వందకోట్లు కలెక్ట్ చేస్తాయి కదా. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. చాలా సినిమాలు ఇంత మాత్రం కూడా రాబట్టలేకపోతున్నాయి. అలా చూసుకుంటే నా సినిమా హిట్ అయినట్లే కదా. కానీ జనాలు ఈ సినిమాను ఫ్లాప్ అనడం విచిత్రంగా ఉంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment