సాక్షి, ముంబై : బిగ్ బాస్ రియాల్టీ షో ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించగా.. హిందీలో చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించారు. 10 సీజన్లు పూర్తిచేసుకున్న హిందీ బిగ్ బాస్ షో త్వరలో 11వ సీజన్లోకి అడుగుపెట్టనుంది. అయితే సీజన్ ఆరంభానికి ముందే షోపై వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. తాను లేకపోతే ఛానెల్‌కు టీఆర్పీ రేటింగ్స్ రావంటూ బాలీవుడ్ కండలవీరుడు, షో హోస్ట్ సల్మాన్‌ఖాన్ సంచలనవ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ చేస్తోంది.
అసలు విషయం ఏంటంటే.. పది సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ అక్టోబర్ 1 నుంచి 11వ సీజన్ ప్రారంభం కానుంది. గత ఆరు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'సల్లూభాయ్' ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా ఉంటారు. ఇటీవల ఇందుకు సంబంధించి ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇదివరకూ దాదాపు రూ.8 కోట్లు తీసుకున్న సల్మాన్.. ఈ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.11 కోట్లు తీసుకుంటారని సమాచారం. తాను తప్ప ఇతర వ్యక్తులు హోస్ట్ చేస్తే.. కంటెస్టెంట్లను హ్యాండిల్ చేయలేరని సల్మాన్ అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీఆర్పీ రేటింగ్స్ కావాలంటే తాను ఉండాల్సిందేనంటూ సల్మాన్ అన్నారని.. ప్రవర్తన సరిగా ఉండాలంటూ పోటీదారులను హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది.