
‘ఇందు మూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా మన టాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు ఫోర్బ్స్ లిస్ట్‌లో చేరారు’. ఇంతకీ ఆ లిస్ట్ స్పెషాల్టీ ఏంటి? అంటే.. ‘ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో దేశంలో అత్యధిక సంపాదనపరులు ఎవరు?’ అనే జాబితాను ప్రతి ఏడాదీ ‘ఫోర్బ్స్ మ్యాగజీన్’ వాళ్లు విడుదల చేస్తారు. ఇది చాలామందికి తెలిసిన విషయం. ఈసారి రిలీజైన లిస్ట్ మన టాలీవుడ్ కాలరెగరేసేలా ఉంది. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఈ ‘టాప్ 100’ లిస్ట్‌లో చోటు దక్కింది.
మన జక్కన్న.. అదేనండీ రాజమౌళి 100 మందిలో 15వ స్థానం దక్కించుకోవడం గర్వించదగ్గ విషయం. ఇక, ‘బాహుబలి’ ప్రభాస్ 22వ స్థానం దక్కించుకున్నారు. ‘భల్లాలదేవ’ రానా లేకుండా ఉంటారా? 36వ స్థానంలో నిలిచారు. హ్యాండ్‌సమ్ హీరో మహేశ్‌బాబు 37వ స్థానం, పవన్ కల్యాణ్ 69, అల్లు అర్జున్ 81వ ప్లేస్ కొట్టేశారు. విశేషం ఏంటంటే.. గతేడాది పోర్బ్స్ జాబితాలో ఓన్లీ మహేశ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది సంఖ్య పెరగడం మనం ఆనందించాల్సిన విషయం.
అది కూడా మొదటి 25 స్థానాల్లో మన తెలుగువాళ్లు ఇద్దరు ఉండటం ఇంకా విశేషం. అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారి లిస్ట్‌ను పోర్బ్స్ ఎనౌన్స్ చేసింది. ఎప్పటిలానే బాలీవుడ్ సెలబ్రిటీలకూ ప్లేస్ దక్కింది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ గతేడాదిలానే ఈ ఏడాది కూడా ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. తదుపరి స్థానాల్లో షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్‌ఖాన్ వరుసగా 2, 4, 6 స్థానాల్లో నిలిచారు.
ఈ అందరి సంగతి పక్కన పెడితే హాట్ గాళ్ ప్రియాంకా చోప్రా ఎనిమిదో ప్లేస్‌ని, సొట్టబుగ్గల సుందరి దీపికా పడుకోన్ 11వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. గత ఏడాది సౌత్ నుంచి 11 మంది ఫోర్బ్స్ లిస్ట్‌లో ఉంటే, ఈ ఏడాది 13 మంది ఉండటం ఆనందించదగ్గ విషయం. ఈ 13 మందిలో తమిళ హీరోలు సూర్య, విజయ్ 25, 31 స్థానాల్లో ఉన్నారు. బాలీవుడ్‌కి మాత్రం కొంచెం నిరాశ తప్పదు. ఎందుకంటే, గత ఏడాది సంఖ్య 35 ఉంటే.. ఈ ఏడాది 33 మాత్రమే ఉంది.
ప్రిపేర్ ఫర్ 2018!
‘నేను నటించిన రెండు సినిమాలు (బాహుబలి, ఘాజీ) ఐఎమ్‌డీబీ టాప్ టెన్‌లో ఉన్నాయి. ఇండియన్ ఫోర్బ్ జాబితాలో చేరాను. లైవ్ షోస్, ఏజెన్సీస్, టెక్నాలజీ... ఇలా ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు 2018కి ప్రిపేర్ అవుతున్నాను. వచ్చే ఏడాది కూడా ఇలానే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని రానా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment