
మరో రెండు రోజుల్లో బేబీ కావాలట!
సమంత ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అర్జంటుగా ఆమెకో బేబీ కావాలట! అది అయ్యే పనేనా? కానీ, కావాలి. మరి, సమంత ఎలా మ్యానేజ్ చేస్తారో కానీ, శనివారానికల్లా ఆమె చేతిలో బేబీ ఉండాల్సిందే. ఇంతకీ.. ఈ బేబీ కథ ఏంటి? అనే విషయం గురించి చెప్పాలంటే ‘బ్రహ్మోత్సవం’ చిత్రం షూటింగ్ గురించి మాట్లాడుకోవాలి. మహేశ్‌బాబు, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల హరిద్వార్‌లో జరిగింది.
ఆ షూటింగ్ లొకేషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ‘బేబి సితార’.. డాటరాఫ్ మహేశ్‌బాబు. సమంతకు సితార చాలా క్లోజ్ అయిపోయింది. షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు సమంత నుంచి చిన్నారి సితార ఓ మాట తీసుకుంది. శనివారం ఇద్దరం ‘ప్లే డేట్’లో కలుద్దామని చెప్పింది. సమంత కూడా ఆనందంగా తలూపేశారు. కానీ, వచ్చేటప్పుడు ఓ బేబీని తీసుకు రావాలని ముద్దు ముద్దుగా సితార అన్నప్పుడు ముచ్చటగానే అనిపించినప్పటికీ బేబీని ఎలా తీసుకెళ్లాలా? అని ఇరకాటంలో పడిపోయారు సమంత. మరి.. సితారను సమంత ఏ మాయ చేస్తారో?