
ఉత్సవం+ ఉత్సాహం= బ్రహ్మోత్సవం
సమంత అంటే ఇప్పుడు ఆకాశమంత. నటనలో ఆమె చూపే ప్రతిభ... పాత్రల్లో ఒదిగిపోయే విధానం ప్రేక్షకుల్లో ఆమెకుండే క్రేజ్...ఇలా అన్నీ హైలోనే ఉంటాయి. అందుకే ఆమెతో కలిసి పనిచేసేందుకు దర్శక-నిర్మాతలు ఇష్టపడుతుంటారు. హీరోలు కూడా సమంతతో కలిసి పనిచేయడం ఎంతో ఆస్వాదిస్తుంటామని చెబుతుంటారు. ఈ సమ్మర్‌లో ‘పోలీస్’, ‘24 తో ప్రేక్షకుల ముందుకొచ్చి రెండు విజయాల్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ‘బ్రహ్మోత్సవం’తో మురిపించబోతోంది, మహేశ్‌బాబుతో కలిసి ఆమె చేసిన మూడో చిత్రమిది.
‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చె ట్టు’.. రెండూ కూడా విజయాలే. మూడో చిత్రం ‘బ్రహ్మోత్సవం’తో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అంటోంది సమంత. ఆమె స్పెషల్‌గా చెప్పిన విషయాలివీ...
నటీనటులు వాళ్ల వాళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేస్తుంటారు. కానీ, అందులో మనసుకు బాగా నచ్చిన కథతో రూపొందేవి కొన్నే ఉంటాయి. ‘బ్రహ్మోత్సవం’ అలాంటిదే. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలగారు ఇలాంటి ఓ మంచి చిత్రంలో నన్ను భాగం చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
ఈ సినిమా తర్వాత అందరూ బంధువుల గురించి వెతకడం మొదలుపెడతారేమో. ఏడు తరాలు వెనక్కి వెళితే మనకు ప్రపంచమంతా బంధువులు అన్నట్లు ఉంటుంది. నాకు నా మూలాలు గుర్తుకొచ్చాయి. ఈ కథ గురించి మా అమ్మకి చెప్పా. పేరుకు తగ్గట్టుగానే కుటుంబమంతా కలిసి ఉత్సాహంగా ఓ ఉత్సవాన్ని జరుపుకున్నట్టు ఉంటుంది ‘బ్రహ్మోత్సవం’.
బోల్డెన్ని సరదాలు....
ఇందులో నేను ఎన్నారై అమ్మాయిగా నటించా. నా పాత్రకంటూ ప్రత్యేకంగా పేరే మీ ఉండదు. అయినా శ్రీకాంత్ అడ్డాలగారి సినిమాలో ఏ పాత్రకీ పేరుండదు. మావయ్య, అత్తయ్య, బాబాయ్, పిన్ని, చిన్నోడు, పెద్దోడు... ఇలా బంధాలు, అనుబంధాలు ఉంటాయి తప్ప పేర్లు మాత్రం వినిపించవు! ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ప్రతి పాత్రకి తగినంత ప్రాధాన్యం ఉంది. కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో నేను లేకపోయినా చిత్రీకరణ జరిగినన్నాళ్లు ఓ పండగ వాతావరణంలో గడిపినట్టు అనిపించింది.
మహేశ్‌తో షూటింగ్ ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. ఇప్పటికే మేం కలిసి రెండు సినిమాలు చేశాం. మూడో సినిమా అనేసరికి మరింత ఉత్సాహం కలిగింది. సెట్లో నవ్వుతూ, నవ్విస్తూ గడుపుతుంటారు. ఈ సినిమాతో నాకు మరో ఫ్రెండ్ కూడా దొరికింది. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు.. మహేశ్ కూతురు సితార. తను నన్ను కూడా ఓ చిన్న అమ్మాయిలానే చూస్తుంటుంది. అందుకే మేమిద్దరం క్లోజ్ అయ్యాం. సెట్లో కలిసినప్పుడు ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్లమో. తన స్మైల్, డ్యాన్స్ యాక్టింగ్ చూస్తే పెద్దయ్యాక స్టార్ హీరోయిన్ అవుతుందేమో అనిపిస్తుంది.
అది మంచిదే...
మహేశ్, కాజల్, శ్రీకాంత్ అడ్డాల... ఇలా ఇది వరకే కలిసి పనిచేసిన వ్యక్తులతో మరోసారి పని చేయడం సంతృప్తినిచ్చింది. ఒకసారి నాతో సినిమా చేసిన దర్శకుడు మళ్లీ నన్ను పిలిచి అవకాశం ఇచ్చారంటే అది నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. అది అవార్డుకంటే ఎక్కువ నాకు. శ్రీకాంత్ అడ్డాల గారితో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేయడం మరిచిపోలేని అనుభవం. ఆ జ్ఞాపకాలు నా మనసులో ఇంకా పదిలంగా ఉండగానే ‘బ్రహ్మోత్సవం’లో నటించే అవకాశాన్నిచ్చారు. ఈ సెట్లో అనుభవాలు మరికొన్నాళ్లు నన్ను వెంటాడుతూ ఉంటాయి. ఈ మధ్య నన్ను సీనియర్ హీరోయిన్‌గా చూస్తున్నారు. ఆ హోదాకి తగ్గట్టుగానే మంచి కథలు, మంచి పాత్రలు లభించడం నా అదృష్టం. తెలుగు, తమిళం.. రెండు భాషలకూ ప్రాధాన్యం ఇస్తున్నా. మహేశ్ కూడా నెక్స్ట్ మురుగుదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. అది చాలా మంచిది.
ఆ రెండూ కూడా....
ఎనిమిది నెలలుగా నాన్‌స్టాప్‌గా పనిచేస్తున్నా, అందుకే కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నా. వరుసగా సినిమాలు ఒప్పుకోకుండా బాగా నచ్చిన కథల్ని చేయాలని నిర్ణయించుకున్నా. కొత్తగా ఒప్పు కున్న సినిమాలేవీ లేవు. ‘బ్రహ్మోత్సవం’, ‘అ.. ఆ’ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ రెండు సినిమా లు కూడా విజయం సాధించాయంటే నేను పడిన కష్టానికి పరిపూర్ణమైన ఫలితం దక్కినట్లు భావిస్తా.