రాశీ లెక్క తప్పింది..!
జనతా గ్యారేజి విజయంతో పాటు.. చైతూతో పెళ్లి కుదిరిన తర్వాత మంచి సంతోషంగా ఉన్న సమంతకు ఇప్పుడు మరో తీపి కబురు అందినట్లు తెలుస్తోంది. లెక్కల మాస్టారు సుకుమార్ తన 'నాన్నకు ప్రేమతో' విజయం తర్వాత రాంచరణ్‌తో తీస్తున్న సినిమాకు సమంతను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ధృవ సినిమా తర్వాత తాను సుకుమార్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నట్టుగా చరణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.
(చరణ్ కోసం చెమటోడుస్తోంది)
ఈ సినిమాలో రాశీఖన్నా చేస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చేయడానికే కొంచెం సన్నబడాలని వర్కవుట్ల కోసం ఆమె చెమటోడ్చి కష్టపడుతున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అంతలో ఏమైందో గానీ.. ఉన్నట్టుండి ఇప్పుడు సమంత పేరు బయటకు వచ్చింది. జనతా గ్యారేజి తర్వాత దాదాపు ఏడాదిపాటు గ్యాప్ తీసుకున్న సమంత.. ఇప్పుడు ఈ సినిమాలో చేస్తోందంటున్నారు. ఇక చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రాంచరణ్.. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'తని ఒరువన్' సినిమా రీమేక్‌గా రూపొందిన ధృవ కోసం తన లుక్, స్టైల్ పూర్తిగా మార్చేసుకున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతోంది. ధృవ రిలీజ్ తరువాత సుకుమార్, చరణ్ల కాంబినేషన్లో సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.