
సమంతో రమ్య కృష్ణవంశీయమ్
క్రియేటివ్ డెరైక్టర్ కృష్ణవంశీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? పదహారు నెలల క్రితం రామ్‌చరణ్‌తో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ తరువాత ఆయన వార్తల్లో కనిపించడం లేదేంటి? వీటి గురించి రకరకాల వార్తలు వినిపించాయి. అయితే, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు జవాబు దొరికింది. ఒక విభిన్నమైన ప్రాజెక్ట్ రూపకల్పనకు కృష్ణవంశీ సర్వం సిద్ధం చేసినట్లు కృష్ణానగర్ కబురు. ఆయన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి, ‘రుద్రాక్ష’ పేరుతో స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్నారట!
కాంబినేషన్ థండర్...
విభిన్నమైన ఈ స్క్రిప్ట్‌లో సస్పెన్స్, సెంటిమెంట్, థ్రిల్లింగ్ అంశాలు - అన్నీ ఉన్నాయని సమాచారం. ఇలా అన్ని అంశాలూ రంగరించిన ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఒక అరుదైన కాంబినేషన్‌ను కూడా సిద్ధమవుతోంది. చిత్రంలో ప్రధాన పాత్ర కోసం తమన్నాతో మొదలుపెట్టి అనుష్క దాకా రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఆ పాత్ర హీరోయిన్ సమంతను వరించింది. ఇంకా స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన సమంత తొలిసారిగా కృష్ణవంశీ చిత్ర నాయిక అవుతున్నారు. మరో విశేషం ఏమిటంటే, ఇటీవలే ‘బాహుబలి’లో శివగామిగా, ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో సత్యభామగా అందరినీ ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఓ కీలకపాత్ర ధరిస్తుండడం! గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చంద్రలేఖ’ లాంటి సినిమాల్లో నటించిన ఆమె, పెళ్ళయ్యాక తన భర్త దర్శకత్వంలో పూర్తి స్థాయి పాత్ర చేయడం ఇదే తొలిసారి. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారట. కృష్ణవంశీ కెరీర్‌లోకెల్లా భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రానికి అలా క్రేజీ కాంబినేషన్ కూడా సెట్ అయింది.
విజువల్ వండర్...
ఇంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ అంతా పూర్తి అయిందని ఆంతరంగిక వర్గాల సమాచారం. ఈ స్క్రిప్ట్ మీద కృష్ణవంశీ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుతో పాటు ఆయన కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే, వాటికి సంబంధించిన నిపుణులతో ఇప్పటికే సంప్రతింపులు జరుగుతున్నాయి. ఇలాంటి హై-టెక్నికల్ సినిమాకు సమర్థుడైన కెమేరా నిపుణుడు అవసరం కాబట్టి, ఆ బాధ్యతను సీనియర్ కెమేరామన్ ఛోటా కె. నాయుడుకు అప్పగిస్తున్నట్లు భోగట్టా. కృష్ణవంశీ - ఛోటా కె.నాయుడుల కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం!
ఈ భారీ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా, తమిళంలోనూ ఏకకాలంలో నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ‘రుద్రాక్ష’ అనే వర్కింగ్ టైటిల్‌తో సద్దు చేయకుండా తెర వెనుక పనులన్నీ సాగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే! ఆ మాటెలా ఉన్నా, ఇప్పటికైతే - కృష్ణవంశీ, రమ్యకృష్ణ, సమంత - ఇంతటి అరుదైన క్రేజీ కాంబినేషన్ ఈ మధ్య కాలంలో వినలేదని కృష్ణానగర్ జనం చెప్పుకొంటున్నారు. ఇంకేం... ఈ ‘సమంతో రమ్య కృష్ణవంశీయమ్’తో ఈ క్రియేటివ్ డెరైక్టర్ మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయిపోయినట్లే! ఆల్ ది బెస్ట్ టు ది క్రేజీ ప్రాజెక్ట్ అండ్ డెరైక్టర్!!