తన గారాల పట్టి నైరాకు పాలు పడుతూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు నటి సమీరారెడ్డి. రెండోసారి గర్భం దాల్చిన నాటి నుంచి తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆమె. గర్భిణిగా ఉన్నపుడు, ప్రసవం తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు, శరీరాకృతి గురించి ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని మహిళల్లో స్ఫూర్తి నింపారు. ప్రస్తుతం ప్రపంచ తల్లిపాల వారోత్సవం(ఆగష్టు 1-7)సందర్భంగా తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ, అటువంటి సమయంలో భర్తలు... ఏవిధంగా అండగా ఉండాలో సూచిస్తూ సమీరా పెట్టిన పోస్టు నెటిజన్లను హత్తుకుంటోంది.
‘అమ్మ’ పై ప్రేమ, గౌరవం చూపండి!
‘ కొత్తగా తండ్రులైనవారు, ప్రియమైన నా వాళ్లందరూ ఈ విషయాన్ని శ్రద్ధగా గమనించండి! ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా మీకో విషయం చెప్పదలచుకున్నాను. కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు మీ అండ అవసరం. గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత మహిళల్లో ఒక రకమైన ఒత్తిడి, భయం నెలకొంటాయి. వారు ఆత్మవిశ్వాసంతో ఉండలేరు. ఇవన్నీ పరోక్షంగా వారి ఆరోగ్యంపై.. ముఖ్యంగా చనుబాలపై ప్రభావం చూపుతాయి. బిడ్డతో వ్యవహరించే తీరులో మార్పునకు కారణమవుతాయి. కాబట్టి పాల ఉత్పత్తి తగ్గిపోయి శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇటువంటి సమయాల్లో మీ సహకారం ఆమెకు అవసరం. మీ ప్రేమతో ఆ ఒత్తిడిని, భయాలను దూరం చేయండి. ఇక ఇంకో విషయం బిడ్డకు చనుబాలు పట్టే తల్లులను హేళనగా చూస్తూ వాళ్లను సిగ్గుతో బిగుసుకుపోయేలా చేయకండి.
తల్లులూ మీరూ వినండి. పాలు పడటం లేదని ఆందోళన చెందకండి. పాలు పట్టే తీరును బట్టి కూడా వాటి ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం ఈ విషయంలో అస్సలు ఒత్తిడికి లోనవ్వను. ప్రతీ అమ్మపై ప్రేమ, గౌరవం చూపాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అంటూ సమీరా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. అంతేగాక తన బిడ్డను హత్తుకొని ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేశారు.
ఇక మరో నటి నేహా దుఫియా కూడా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తన బిడ్డ మెహర్ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ ఓ సందేశాత్మక వీడియో రూపొందించారు. బహిరంగ ప్రదేశాల్లో సిగ్గుపడకుండా అనువైన రీతిలో బిడ్డకు పాలు పట్టడం నేరమేమీ కాదని నేహ వీడియోలో చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment