'సంపూ' ఓ సోషల్ మీడియా హీరో..
ఇది సోషల్ మీడియా కాలం. సోషల్ మీడియా సృష్టిస్తున్న ట్రెండ్ లో అందరూ భాగస్వాములవుతున్నారు. దేశ ప్రథమ పౌరుడి నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాతో అనుసంధానమై ఉన్నారు.
ఇది సోషల్ మీడియా కాలం. సోషల్ మీడియా సృష్టిస్తున్న ట్రెండ్ లో అందరూ భాగస్వాములవుతున్నారు. దేశ ప్రథమ పౌరుడి నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాతో అనుసంధానమై ఉన్నారు. హీరోలను జీరోలుగా చేయాలన్నా, ఓ సామాన్యుడిని హీరో చేయాలన్నా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రజలను చేరుకోడానికి, పార్టీ ఎజెండాను ప్రజలకు విన్నవించడానికి, ప్రత్యర్ధులను ఎండగట్టడానికి సోషల్ మీడియాను ప్రధాన ఆస్త్రంగా మలుచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా ప్రభావం ఓ అతి సామాన్యుడుగా కనిపించే 'సంపూర్ణేష్ బాబు' ఓ హీరోను చేసింది. 'నేనే సంపూ... ముద్దు పేరు తెగింపు... ఎప్పుడెపుడా అని చూస్తున్నారా.. కన్నులకి ఇంపు.. ఎక్కడెక్కడా అని చూస్తున్నారా.. ఇదిగోరా సంపూ' అంటూ పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తెలుగు సినిమా హీరో అనిపించుకోడానికి కావాల్సిన లక్షణాల్లో ఏ ఒక్కటీ లేని సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రత్యేక చర్చగా మారాడు. సంపూర్ణేష్ బాబు వెనుక సినీ వారసత్వం లేదు, సినీ పరిశ్రమలో ఏ ఒక్క గాడ్ ఫాదర్ లేడు. పెద్ద పొట్ట, పొట్టి ఆకారంతో కమెడియన్ ను మరిపించేలా ఉండే సంపూర్ణేష్ బాబును సోషల్ మీడియానే టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చింది. వారసత్వంగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న, నిలదొక్కుకుంటున్న హీరోల కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపించే సంపూర్ణేష్ బాబు.. ఏ నలుగురు కలిసినా చర్చతోపాటు నవ్వుకోవడానికి పాయింట్ గా మారాడు. సినిమాలో నవ్వించాడో లేదు.. నవ్విస్తాడో తెలియదు కానీ.. ట్రైలర్ వచ్చినా.. ఫేస్ బుక్ లో సంపూ కనిపించినా చాలు పెదవిపై నవ్వు విరబూయాల్సిందే.
తొలి చిత్రం 'హృదయ కాలేయం' ప్రారంభం కావడానికి ముందు సంపూర్ణేష్ బాబు ఓ అనామకుడు. హృదయ కాలేయం టీజర్ విడుదలైన కొద్ది రోజులకే యూట్యూబ్ లో లెక్కలేనన్ని హిట్స్ వచ్చాయి. 9 నెలల క్రితం విడుదలైన ట్రైలర్ కు ఇప్పటివరకు 9,46,807 హిట్స్ వచ్చాయి. దానికి తోడు సంచలన దర్శకుడు రాజమౌళి కామెంట్ల తో 'సంపూ'కి కోట్లు కుమ్మరించినా రాని పబ్లిసిటీ లభించడమే కాకుండా, సెలబ్రిటీగా మారాడు. తనకు లభించిన పాపులారిటీని మార్కెట్ చేసుకోవడానికి 'హృదయ కాలేయం' ఆడియో వేడుకను సంపూ వేదికగా చేసుకున్నాడు. తొలి సినిమా విడుదల కాకుండానే 'కొబ్బరి మట్ట' అనే రెండో చిత్రానికి స్వీకారం చుట్టాడు కూడా.
ఏది ఏమైనా ఇప్పటి వరకు టీజర్లతో యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన 'సంపూ'లో అసలు సత్తా ఉందా అనే అంశాన్ని తేల్చేందుకు 'హృదయ కాలేయం' శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సినిమాతో సంపూ ఏకంగా వర్మ, మోహన్ బాబు నటించిన చిత్రం 'రౌడీ'ని ఢీకొట్టేందుకు సిద్దమయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో గత తొమ్మిది నెలలకు పైగా ఆసక్తిని రేపి.. హృదయ కాలేయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'సంపూ' సోషల్ మీడియా హీరోగా మిగిలుతాడు.. టాలీవుడ్ లో తనదైన ముద్రను వేసుకుంటాడా అనే కొద్ది రోజులాగితే స్పష్టమవ్వడం ఖాయం. ఇప్పటికే ఐమాక్స్ లాంటి థియేటర్లలో మొదటి రెండు షోలకు టికెట్లు మొత్తం బుక్కయిపోయాయి.
ఒకవేళ నిజంగానే ఈ సినిమా హిట్టయితే మాత్రం ఆ క్రెడిట్ హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ కన్నా.. ఫేస్ బుక్, యూట్యూబ్ లకే దక్కుతుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు.