సముద్రకని కర్త, కర్మ ,క్రియగా అప్పా
నవ్యతకు చిరునామా మలయాళ సినిమా అన్నది ఇంతకు ముందు మాట. ఇప్పుడు దాన్ని తమిళ సినిమా ఆక్రమించుకుందని చెప్పవచ్చు. నాడోడిగళ్ చిత్రంతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సముద్రకని ఆ తరువాత కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించినా ఒక దశలో దర్శకత్వాన్ని దూరంగా పెట్టి పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఆ మధ్య కిత్నా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించాలని భావించారు. అయితే ఆసమయంలో అమలాపాల్ పెళ్లికి సిద్ధం అవడంతో సముద్రకని తన ప్రయత్నానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. తాజాగా ఆయన నటన, దర్శకత్వంతోపాటు నిర్మాతగా అదనపు బాధ్యతలు చేపట్టి అప్పా(నాన్న)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెలైంట్‌గా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి సముద్రకని తెలుపుతూ నాగోడిగళ్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలిసారిగా అప్పా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తూ నటిస్తున్నానని చెప్పారు.
ఇందులో కాక్కాముట్టై చిత్రం ఫేమ్ విఘ్నేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. త ంబిరామయ్య, వినెధిని, నవ నటి ప్రీతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రం అని వివరించారు. కచ్చితంగా అప్పా చిత్రం తమిళ సినిమాకు కొత్తగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారని, ఆయన చిత్రం చూసి అద్భుతంగా తీశావంటూ ప్రశంసించారని సముద్రకని పేర్కొన్నారు. చిత్రాన్ని వచ్చే నెల విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.