రాఘవాచారి, రవి, సాయిమాధవ్, మోహనకృష్ణ
తెలుగు సినిమా రంగంలో రచనలో అగ్రగణ్యుడు సముద్రాల రాఘవాచారి. 1930లలో రచయితగా కెరీర్ ఆరంభించి 30 ఏళ్ల పాటు మాటలు, పాటల రచయితగా, ‘బబ్రువాహన, వినాయక చవితి’ వంటి చిత్రాలతో దర్శకునిగా, ‘దేవదాసు, శాంతి’ వంటి చిత్రాలతో నిర్మాతగా తెలుగు సినిమా రంగంలో సీనియర్ సముద్రాలది ఓ చరిత్ర. జూలై 18న ఆయన 117వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ‘‘మా నాన్న ఎన్టీఆర్ సముద్రాలగారిని మాష్టారు అని పిలిచేవారు’’ అన్నారు నందమూరి మోహనకృష్ణ.
రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ– ‘‘నేటి సినీ రచయితల వైభోగమంతా అప్పుడు వారు పెట్టిన భిక్ష. కె.వి రెడ్డి దర్శకత్వంలో నాగయ్యగారు నటించిన ‘యోగివేమన’ చిత్రంలోని మాటలు తూకం వేసినట్టుగా ఉంటాయి. అందులో ఆయన రచన ఈ రోజుకి రచయితలకు పెద్ద బాలశిక్ష. కొన్ని సందర్భాల్లో నా కలం ముందుకు సాగనప్పుడు ఆ సినిమా ఓ సారి చూస్తా’’ అన్నారు.
ఈ జయంతి వేడుకలను నిర్వహించిన రైల్వే ఉన్నతాధికారి రవి పాడి మాట్లాడుతూ– ‘‘సముద్రాల గారు రాసిన పాటల్లోని ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి...’, ‘దేవదేవ ధవళాచల మందిర...’, ‘జనని శివకామిని..’ పాటలు తెలుగు శ్రోతలకు, తెలుగువారి సాంస్కృతిక జీవితంలో భాగమయ్యాయి. ఇక నుంచి ప్రతి ఏటా సముద్రాల వారి జయంతి రోజున ఒక ఉత్తమ సినీ సంభాషణల రచయితకు, ఉత్తమ సినీ గీత రచయితకు నగదు పురస్కారంతో సత్కరించాలనుకుంటున్నాం’’ అన్నారు. సముద్రాల సీనియర్ మనవడు, సముద్రాల జూనియర్ ఆఖరి కుమారుడు విజయ రాఘవాచారితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment