
తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సందీప్ రెడ్డి వంగా, అర్జున్ రెడ్డి రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్‌లోనూ సంచలనాలు నమోదు చేస్తుంది. అయితే ఈ సినిమాలో షాహిద్ కపూర్.. కియారా అద్వాణీని ముద్దుపెట్టుకునే సన్నివేశాల గురించి సందీప్ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు.
సందీప్ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదంగా మారాయి. ఈ మాటల పట్ల నటి సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, జ్వాలా గుత్తా తదితరులు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. దాంతో సందీప్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను అన్న మాటలను మీడియా తప్పుగా అర్థంచేసుకుందని అన్నారు.
‘నన్ను మీడియా తప్పుగా అర్థంచేసుకుంది. ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండదని అన్నాను. అంటే దానర్థం యువకుడు రోజూ తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. కానీ దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు’ అన్నారు సందీప్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment